సిద్దిపేట, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లాలో బుధ, గురువారాల్లో కురిసిన భారీ వర్షాలు,వరదల నుంచి జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. భారీ వరదలతో పంట పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కాలనీల్లో చేరిన బురద, మట్టిని తొలిగిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడికక్కడ పడిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లు తెగి పలు మార్గాల్లో రాక పోకలు స్తంభించాయి. పునరుద్ధరణ పనులు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున వరదలు, వర్షాలు వచ్చినా ప్రభుత్వ చర్యలు అరకొరగానే ఉన్నాయి. మెదక్‌కు సీఎం వచ్చి పోయినా సహాయ చర్యల్లో స్పీడ్ కరువైంది.
జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్, జిల్లా మంత్రులు దామోదర రాజనర్సింహ చుట్టపు చూపులా వచ్చి పోయారే తప్ప చర్యలు తీసుకోలేదు. ఇప్పటి చాలా గ్రామాలకు రాకపోకలు ప్రారంభం కాలేదు, తాగునీరు, సరుకులకు ఇబ్బందులు పడుతున్నారు. చాలా గ్రామాల్లో వరదతో వచ్చి చేరిన మట్టి కుప్పలు తెప్పలు అలానే ఉండి పోయింది. పంట పొలాల్లో పేరుకుపోయిన మట్టిని తొలిగించాలంటే రైతులకు ఖర్చుతో కూడుకున్న పని. అసలే సాగు ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల్లో రైతులను ఈ వరదలు మరింత నష్టాన్ని తెచ్చి పెట్టాయి. మందు బస్తాలు దొరకక, పెట్టుబడి సాయం అందక అప్పులు తెచ్చి సాగు చేసిన రైతులకు అపార నష్టం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
భారీ వర్షాల కారణంగా ఉమ్మడి జిల్లాలో 103 చెరువులు దెబ్బతిన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 26, మెదక్ జిల్లాలో 63, సిద్దిపేట జిల్లాలో 14 చెరువులు గండ్లు పడ్డాయని అధికారులు తెలిపారు.
ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు భారీ వర్షాల కారణంగా సిద్దిపేట జిల్లాలో 7345 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. సంగారెడ్డి జిల్లాలో 2208 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అత్యధికంగా మెదక్ జిల్లాలో 16230 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో అంతకు ఎక్కువగా పంట నష్టం జరిగినట్లు రైతులు పేర్కొంటున్నారు. రైతుల పంట పొలాల్లో ఇసుక మేటలు అలానే ఉన్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 925 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. సంగారెడ్డి జిల్లాలో 257, మెదక్ జిల్లాలో 418, సిద్దిపేట జిల్లాలో 250 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. వందలాది ట్రాన్స్ఫార్మర్లు నేలకూలాయి.
గతంలో ఎన్నడూ లేనంతగా ఉమ్మడి మెదక్ జిల్లాను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తడంతో భారీగా నష్టం వాటిల్లింది.కానీ, ప్రభుత్వం నుంచి ఆ స్థాయిలో స్పందన కరువైంది. సీఎం రేవంత్ మెదక్ జిల్లా కేంద్రంలో అధికారులతో పావుగంట రివ్యూ పెట్టి చేతులు దులుపుకొని వెళ్లారు. తక్షణ సాయంగా మెదక్ జిల్లాకు కోటిరూపాయలు ప్రకటించారు. ఈ నిధులు ఏ మూలకు సరిపోవు. జిల్లాలో వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఒక్క మెదక్ జిల్లాకు రూ. 400 కోట్ల వరకు సాయం కావాల్సి ఉంది. మిగతా జిల్లాలకు అటు ఇటుగా లెక్కలు వేసుకున్నా ఉమ్మడి మెదక్ జిల్లాకు కనీసం రూ. 600 కోట్ల నష్టం వాటిల్లింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 25,783 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఎకరానికి రూ. 25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.