బచ్చన్నపేట, అక్టోబర్ 28 : స్వయంగా సీఎం కేసీఆర్ జనగామ ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో నన్ను మీ వద్దకు పంపించిండు. ఆదరించి.. ఆశీర్వదించి జనగామ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీకు సేవ చేస్తానని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని తమ్మడపల్లి, చిన్నరామన్చర్ల, పోచన్నపేట గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పల్లాకు బ్రహ్మరథం పట్టారు. కేసీఆర్ వెంటే తామంతా ఉంటామని పల్లాకు భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల జనగామకు వచ్చిన సీఎం తన గురించి ప్రజల సమక్షంలో వెల్లడించారని గుర్తు చేశారు. పల్లా 24 గంటలు నా ఇంట్లో వ్యక్తి. మీ కోసం మీకు సేవ చేసేందుకు జనగామకు పంపిస్తున్నా.. ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత మీది.. మీకు పనులు చేసి పెట్టే బాధ్యత నాది అని అన్నారని ఆయన మరోసారి గుర్తు చేశారు. తనకు ఒకసారి అవకాశమిస్తే జనగామను సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కు ధీటుగా తీర్చిదిద్దుతానన్నారు.
సీఎం దగ్గర నిధులు ఎలా తేవాలో, మంత్రుల వద్ద నిధులు ఎలా మంజూరు చేయించుకోవాలో నాకు తెలుసన్నారు. ఒకనాడు కరువుకు చిరునామా అయిన జనగామ, బచ్చన్నపేట సీఎం కేసీఆర్ చలువతో నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలమైందన్నారు. పుష్కలంగా పంటలు పండుతున్నాయని, ప్రతి రైతు దర్జాగా బతుకుతున్నాడన్నారు. పంటలకు పెట్టుబడి, రైతుబీమా, పంట రుణమాఫీ, కేసీఆర్ కిట్లు, పింఛన్లు, కల్యాణలక్ష్మి వంటి ఎన్నో ఆద్భుత పథకాలు ప్రతి ఇంటికి చేరాయన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే ప్రతి మహిళకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు నెలకు రూ.3 వేలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో రూపొందించారని తెలిపారు. పంట పెట్టుబడి ఎకరానికి రూ.16 వేలకు పెంచనున్నట్లు చెప్పారు. అన్ని రకాల పింఛన్లు ఐదేండ్లలో రూ.5 వేలకు పెంచేలా ప్రణాళికలు వేశారని వివరించారు. ఆరోగ్యశ్రీ కింద రూ.15 లక్షల వరకు ఖర్చులు అందించే వీలు కల్పించనున్నట్లు చెప్పారు. రైతుబీమా తరహాలో భూమిలేని వారికి కూడా కేసీఆర్ బీమా అమలు చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు.
తాను ఎమ్మెల్యేగా గెలిచాక నెల రోజుల్లో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానన్నారు. గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు ఇచ్చిన సమస్యలతోపాటు గ్రామాల్లో తాను కూడా ప్రజలకు ఏమీ కావాలో సర్వే చేయించామని చెప్పారు. జనగామను ఇండస్ట్రీయల్ కారిడార్‌గా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్‌తో కొట్లాడి నిధులు తీసుకొస్తానన్నారు. రుణమాఫీ అందరికీ వర్తించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పంట నష్టపరిహారం అందేలా కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మితే మనమంతా నట్టేట మునిగినట్టేనన్నారు. పదేండ్లుగా కష్టపడి పనిచేస్తున్న ప్రభుత్వానికి పట్టం కడుదామని ప్రజలు ముందుకొస్తున్నారని తెలిపారు. ఉద్యమంలో కేసీఆర్‌కు తోడుగా బచ్చన్నపేట మండల ప్రజలు నిలిచారని గుర్తు చేశారు. తెలంగాణలో నాడు 24 లక్షల మెట్రిక్ టన్నులు పండిస్తే నేడు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తున్నామని తెలిపారు.
పింఛన్ల పెంపుతో వృద్ధులు, మహిళల ఆత్మగౌరవం పెరిగిందన్నారు. వారి కాళ్లపై వారే నిలబడడంతోపాటు మనవడికి బిస్కట్లకు ఇచ్చే స్థాయికి ఎదిగారన్నారు. అనంతరం పోచన్నపేటలో పల్లా సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకు చెం దిన యువకులు బీఆర్ఎస్లో చేరారు. అంతకుముందు బచ్చన్నపేట మండలం కొడవటూరులో సిద్ధేశ్వరస్వామిని పల్లా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆయా గ్రామాల సర్పంచు, ఎంపీటీసీ మేకల కవితారాజు, గుర్రాల లలితానర్సిరెడ్డి, ఎండీ ఖలీల్ఆజాం, మామిడి అరుణాఐలయ్య, మాజీ శాసనమండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఆప్కో చైర్మన్ మండల శ్రీరాములు, ఆర్బీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కనకయ్యగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ పూర్ణచందర్, నాయకులు, సర్పంచు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, జనగామ ఎంపీపీ కళింగరాజు, మద్దూరు మండల నాయకులు మల్లేశం, మద్దికుంట రాధ, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.