మెదక్ రూరల్, నవంబర్12: బాలల దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ సారస్వత పరిషత్ నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్కు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని కీర్తన ప్రథమ బహుమతికి ఎంపికైనట్లు తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి జె.చెన్నయ్య తెలిపారు.
ఈ నెల 23న హైదరాబాద్లో నిర్వహించనున్న కార్యక్రమంలో కీర్తనకు రూ.2వేల నగదుతో పాటు మెమొంటో, ప్రశంసాపత్రం అందజేస్తామని చెన్నయ్య పేర్కొన్నారు. జాతీయ స్థాయి కథల పోటీలో ప్రథమ బహుమతికి కీర్తన ఎంపిక కావడం పట్ల ప్రధానోపాధ్యాయులు ఆడెపు కరుణాకర్ అభినందించారు. విద్యార్థుల రచనలతో గత సంవత్సరం హవేళి ఘణపూర్ అమృత గుళికలు పుస్తకం ప్రచురించామని, భవిష్యత్ లో కూడా పుస్తక ప్రచురణ చేస్తామన్నారు. విద్యార్థులలో సాహిత్య సృజనకు పాటుపడుతున్న తెలుగు ఉపాధ్యాయులు ఉండ్రాళ్ళ రాజేశం, నల్ల అశోక్, ఎల్లమ్మలను అభినందించారు.