చేగుంట,మార్చి16: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించి గోదావరి జలాలను తెస్తే.. జలాలను చెరువులు , కుంటల్లోకి తీసుకెళ్ల్లడానికి కనీసం కాలువలు నిర్మించని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మళ్లీ పాత రోజులు వస్తున్నాయని, కరెంట్ కష్టాలు, కరువు కాటకాలు కనిపిస్తున్నాయని తెలిపారు. నార్సింగి సబ్‌స్టేషన్‌లోని 8ఎంవీఎ పవర్ ట్రాన్స్ఫార్మర్ బ్రేక్‌డౌన్ కావడంతో రైతులకు విద్యుత్ అంతరాయం కలుగుతున్న విషయాన్ని తెలుసుకొని ఆదివారం సబ్‌స్టేషన్‌ను ఆయన పరిశీలించారు.
విద్యుత్ అధికారులతో మాట్లాడి మరమ్మతులు చేసి రైతులకు విద్యుత్ సరిగ్గా అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మార్పు తెస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి కరువు కాటకాలు, కరెంట్ కష్టాలు తెచ్చిందని ఎద్దేవా చేశారు. రైతు సంక్షేమానికి కేసీఆర్ కృషి చేస్తే, కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలే దాపురించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలు పూర్తిచేసి దుబ్బాక నియోజకవర్గాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయాలని ఏడాదిగా మంత్రులు ,అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు.
బీఆర్ఎస్ హయాంలో నీళ్లు కావాలని రైతులు ఫోన్ చేస్తే విడుదల చేశామని, కాలువలకు నీళ్లు విడుదల చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ దృష్టికి, ప్రాజెక్టు ఈఎన్సీ దృష్టికి తీసుకెళ్లినా తగినన్ని నీళ్లు విడుదల చేయడం లేదన్నారు. ఎండిన పంటల పాపం కాంగ్రెస్‌దే అని విమర్శించారు. అనంతరం నార్సింగిలో సీసీ రోడ్లకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైలరాం బాబు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, నాయకులు ఆకుల మల్లేశంగౌడ్, భూపతి, నాయకులు, రామాయంపేట ఏడీఈ ఆదయ్య, ఏఈ గణేశ్ తదితరులు ఉన్నారు.