ఎనిమిదో విడత హరితహారానికి సర్వం సిద్ధం
జిల్లాలో 40లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
అటవీ శాఖ నేతృత్వంలో మొక్కల పెంపకం
ప్రతీ పంచాయతీలో నర్సరీల ఏర్పాటు
శాఖలవారీగా లక్ష్యాలు నిర్దేశించిన ప్రభుత్వం
అన్ని ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం
తెలంగాణకు హరితహారం ఎనిమిదో విడత కార్యక్రమానికి అధికార యంత్రాంగం సమాయత్తమవుతున్నది. ఈ కార్యక్రమాన్ని త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభించనుండగా, అందుకు జిల్లా అధికారగణం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వం శాఖలవారీగా లక్ష్యాలు నిర్దేశించింది. ఈ సారి జిల్లాలో 40 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, అంతకు మించి నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉంచారు. 499 పంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. ప్రధానంగా నీటిపారుదల రంగంపై ప్రత్యేక శ్రద్ధపెట్టి ఎక్కువగా కాల్వల గట్లపై మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. వచ్చే నెలలో వర్షాలు పడగానే, మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నారు. ఈలోగా గుంతల తీత కార్యక్రమాన్ని ముమ్మరం చేయనున్నారు.
సిద్దిపేట, మే 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. నాటి న ప్రతి మొక్కనూ కాపాడేలా ప్రత్యేక చర్య లు తీసుకోనున్నారు. ఎనిమిదో విడత హరితహార కార్యక్రమం కింద జిల్లాలో 40 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారి ప్రధానంగా కాల్వల గట్లపై మొక్కలు నాటే విధంగా ప్రణాళికలు సిద్ధ్దం చేసుకున్నారు. వర్షాలు కురవగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నారు. ఆ లోగా గుంతల తీత కార్యక్రమా న్ని ముమ్మరం చేయనున్నారు.
2015 సంవత్సరం నుంచి ..
2015 సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటింది. రోడ్లకు ఇరువైపులా,ప్రభుత్వ స్థలాల్లో వివిధ రకాల మొక్కలు నాటడంతో గ్రామాలు, పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఏ గ్రామానికి వెళ్లినా పచ్చదనం స్వాగతం పలుకుతున్నది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేశారు. ఆ గ్రామానికి సరిపడా మొక్కలను అక్కడి నర్సరీలోనే పెంచి అందజేస్తున్నారు. జిల్లాలో 499 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఉన్నాయి. ఇవి కాకుండా అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కలు ఎక్కడికి అవసరం ఉంటే అక్కడికి పంపడంతో పాటు రోడ్లకు ఇరువైపులా, అటవీ ప్రాంతాల్లో నాటుతున్నారు.
పెరిగిన పచ్చదనం..
హరితహారం అమలు తర్వాత పల్లె, పట్టణం అని తేడా లేకుండా అంతటా పచ్చదనం పెరిగి పరిసరాలు ఆహ్లాదకరంగా మారాయి. మొక్కలతో నీడ, స్వచ్ఛమైన గాలి, వాతావరణంలో తేమ పెరిగిన అనుకూల వాతావరణం ఏర్పడింది. హరితహారంలో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఏపుగా పెరిగి కొత్త శోభ ను తీసుకువచ్చాయి. మున్సిపాలిటీలు, కొన్ని గ్రామ పంచాయతీల్లో హరితహారం కింద నాటిన మొక్కలను పాడు చేస్తే జరిమానాలు విధిస్తున్నా రు. దీంతో ప్రతి ఒక్కరూ మొక్కలను తమ బిడ్డ ల్లా చూసుకుంటున్నారు. జిల్లాలోని అన్ని గ్రామా ల్లో ఏర్పాటు చేసిన నర్సరీలు ఆగ్రామాలకు సరికొత్త శోభను తీసుకు వచ్చాయి అని చెప్పాలి. పం డ్లు,పూలు, నీడనిచ్చే మొక్కలతో పాటు ఔషధ, సుగంధ ద్రవాల్య మొక్కలు పెంచుతున్నారు.
ఎనిమిదో విడత లక్ష్యం 40 లక్షల మొక్కలు
ఈసారి జిల్లాలో 40 లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఖాళీ స్థలాలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటనున్నారు. ప్రభుత్వ స్థలాలు, విద్యాసంస్థలు ఇలా ప్రతిచోట మొక్కలు నాటుతారు. ఎనిమిదో విడత హరితహారంలో ప్రధానంగా నీటిపారుదల రంగంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించనున్నారు. మిషన్ కాకతీయలో భాగంగా పెద్ద ఎత్తున చెరువుల పూడికతీతతో పాటు చెరువు గట్లను బాగు చేశారు. చెరువు ఊరికి ఆదెరువు. ఈ చెరువు గట్లపై వివిధ రకాల ఫలాల మొక్కలు నాటనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున రిజర్వాయర్ల నిర్మాణం జరిగింది. ప్రధాన కెనాల్స్‌తో పాటు పిల్ల కాల్వలు ఉన్నాయి. వీటన్నింటి గట్లపైన ఈసారి పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నారు.