సిద్దిపేట, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా రైతుల ప్రయోజనాల దృష్ట్యా నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు బుధవారం లేఖ రాశా రు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఉమ్మ డి మెదక్ జిల్లా సాగు, తాగునీటికి నోచుకోలేదని, తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ నిర్మాణాలు చేపట్టారని లేఖలో పేరొన్నారు. ఈ రిజర్వాయర్ల ద్వారా వరుసగా నాలుగేండ్లు జిల్లాలోని రైతాంగానికి గోదావరి జలాలు అందించామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన నాలుగు ప్రాజెక్టుల ద్వారా నాలుగు జిల్లాలు సిద్దిపేట, మెదక్, యాదాద్రిభువనగిరి, జనగామలకు సాగు, తాగునీరు అందించామన్నారు.
గత సంవత్సరం యాసంగి పంటకు కాళేశ్వరం జలాలతో నాలుగు ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా మూడు లక్షల ఎకరాల పంట పం డిందని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లాలోని ప్రాజెక్టులైన మల్లన్నసాగర్లో ప్రస్తుతం 19.03 టీఎంసీలు, కొండపోచమ్మసాగర్‌లో 9.5టీఎంసీలు, రంగనాయకసాగర్‌లో 2.57 టీఎంసీలు, అన్నపూర్ణలో 3.21 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని, ఈ సంవత్సరం యథావిధిగా రైతులకు సాగునీరు అం దించడానికి నీటి ప్రణాళిక కమిటీని ఆదేశించాలని మంత్రిని కోరారు. ప్రస్తుతం మిడ్ మానేరు(రాజరాజేశ్వర జలాశయం)లో 27 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని, మిడ్ మానేరు నుంచి అవసరమైన నీటిని ఈ రిజర్వాయర్లకు పంపింగ్ చేసి పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని కోరారు.
ఇప్పటికే యాసంగి సాగుకు రైతులు సమాయత్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తరపున రైతులకు సాగు నీటి విడుదల కోసం భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరం కూడా చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లకు కాల్వల ద్వారా నీటిని విడుదల చేసి రైతులకు మేలు చేయాలన్నారు. నీటి విడుదలపై ఇరిగేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వం తరపున ఉమ్మడి మెదక్ జిల్లా రైతాంగానికి భరోసా ఇవ్వాలని రైతుల పక్షాన హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.