సిద్దిపేట, మార్చి 29: తెలుగు నూతన సంవత్సరాది శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలు, సుఖసంతోషాలతో అన్నివర్గాల ప్రజలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఉగాది పచ్చడిలాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుతూ.. ఈ ఉగాది మీ కష్టాలకు ముగింపు, మీ విజయాలకు ఆరంభం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సంవత్సరం అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాదించాలని ఆకాంక్షించారు. పదేండ్లలో తెలంగాణ అన్నిరంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించి పురోగమనంలోకి వచ్చిందని, ఈ పదిహేను నెలల్లో సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్ర పేరు ప్రతిష్టలు తిరోగమనంలోకి వెళ్లాయన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వ నిర్లక్ష్యం ధోరణితో సాగునీటి ఇబ్బందులు తలెత్తి రైతులు ఆందోళన చెందుతున్నారని, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురువాలని, రైతులు ఆనందంతో పాడి పంటలతో వర్ధిల్లాలన్నారు. అన్నింటా శుభం జరగాలని, అందరి కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు.