సిద్దిపేట, ఏప్రిల్ 5: సిద్దిపేట జిల్లాలో సన్‌ప్లవర్ రైతులు ఆందోళనలో ఉన్నారని, కొనుగోలు కేంద్రాలు కొనసాగించి పూర్తిస్థాయిలో పంట సేకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును ఫోన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. సన్‌ఫ్లవర్ కోనుగోలు చేయడం లేదని చిన్నకోడూరు మండల రైతులు ఎమ్మెల్యే హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించి ఆయన వెంటనే మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు ఫోన్‌చేసి మాట్లాడారు.
జిల్లాలో మొత్తం పంటను కొనుగోలు చేయాలని కోరారు. వెంటనే కొనుగోలు కేంద్రాల్లో తూకాలు వేయాలని విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట నియోజకవర్గం నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని మంత్రిని కోరారు. ఆయిల్‌పామ్ లాభదాయకమైన పంట అని, ఖమ్మం రైతుల స్ఫూర్తితోనే సిద్దిపేట జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ముందుకు వస్తున్నారని, వారిని ప్రోత్సహించాలని కోరారు.