చిన్నకోడూర్, ఆగస్టు 24: పేదల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆనాటి పాలకులపై తిరగబడి గోలొండ కోటపై జెండా ఎగురవేసిన గొప్ప పోరాట యోధుడు సర్వాయి పాపన్నగౌడ్ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లిలో కౌండిన్య యూత్ అసోసియేషన్ గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఆదివారం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డితో కలిసి ఆయన ఆవిషరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో గొప్ప పోరాటయోధుల చరిత్రను మరుగున పడేశారన్నారు.
సర్వాయి పాపన్నగౌడ్, చాకలి ఐలమ్మ, కొమురంభీమ్ వంటి తెలంగాణ గొప్ప పోరాట యోధుల చరిత్రను బయటకు తీయలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చరిత్రను పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చారని గుర్తు చేశారు. పాపన్న జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ ఏర్పాటు చేసి గీత కార్మికుల సంక్షేమం, అభ్యున్నతి కోసం కృషి చేశామన్నారు.హైదరాబాద్‌లో 63 సొసైటీలు , 140 కల్లు దుకాణాలను ముసివేసి కాంగ్రెస్ ప్రభు త్వం గీత కార్మికుల ఉసురు పోసుకుందని మండిపడ్డారు. తెలంగాణ వచ్చిన వెంటనే సొసైటీలను పునరుద్ధరించి కల్లు దుకాణాలను తెరిపించిన ఘనత కేసీఆర్‌కే దకిందన్నారు.
చెట్ల పన్ను శాశ్వతంగా రద్దు చేయడంతో పాటు రూ.7 కోట్ల బకాయిలను రద్దు చేశామన్నారు. తాటి చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు పడి మరణించిన గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియాగా రూ. 5 లక్షలు ఇచ్చామన్నారు. గీత కార్మికుల పింఛన్ వయసు 50 ఏండ్లకు తగ్గించామని, 20 కోట్లతో నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్ ఏర్పాటు చేశామన్నారు. హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు కోట్ల తాటి,ఈత, ఖర్జూరం మొకలు నాటడంతో కార్మికులకు ఉపాధి పెరిగిందన్నారు. మద్యం దుకాణాల్లో గౌడ్లకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. కల్లుడిపోలపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి గౌడ కులస్తులను అరెస్టు చేయడం దారుణమని మండిపడ్డారు.
మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రమాదవశాత్తు 53 లక్షల మంది గీత కార్మికులు మరణించడం బాధాకరమన్నారు. పాపన్నగౌడ్ ఎన్నో గొలుసు కట్ట చెరువులు నిర్మించినట్లు గుర్తుచేశారు. సర్వాయి పాపన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేయన్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని కుల సంఘాలకు విలువైన భవనాలు నిర్మించి ఇచ్చామన్నారు. కార్యక్రమంలో జైగౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టికూటి రామారావుగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు కనకరాజు, సదానందం గౌడ్, బీఆర్ఎస్వై, బీఆర్ఎస్వీ నాయకులు, మహారాష్ట్ర బీసీ సంఘం నాయకులు, గీత కార్మికులు పాల్గొన్నారు.