జిన్నారం, ఫిబ్రవరి 6: కాంగ్రెస్ హయాంలో కొత్త పథకాల ఊసే లేదని, బీఆర్ఎస్ హయాంలో కొనసాగిన పథకాల్లో కోత విధిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నాడని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పరిధిలోని రాళ్లకత్వలో శుక్రవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హామీ లు అమలు చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి విఫలమయ్యారన్నారు.
మహిళలకు బతుకమ్మ చీరలు, గొల్లకుర్మలకు గొర్రెలు, మైనార్టీలకు రంజాన్క తోఫా, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్టు, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడంలేదన్నారు. గ్రామాలకు ఆర్టీసీ బస్సులను బంద్ చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని గుర్తు చేశారు.మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన భవనాలను ప్రారంభించడం తప్పా సీఎం చేసింది ఏమీ లేదని విమర్శించారు.
ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తే తమపై కేసులు పెట్టడం, లేదంటే బూతు మాటలతో తిట్టడం తప్పా హామీలు అమలు చేయటం లేదన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి, ఎన్నికల ఇన్చార్జిసాయిరామ్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు మధుసూదన్‌రెడ్డి, వెంకటేశంగౌడ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ మన్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, నేతలు మాణిక్‌యాదవ్, రాజేశ్, యాదగిరి, రామకృష్ణ, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
జిన్నారంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యాలయాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన సూచించారు.