హనుమకొండ, ఆగస్టు 1 : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఓటర్లు భారీగా తగ్గనున్నారు. ఒక్క హనుమకొండ జిల్లాలోనే లక్షకు పైగా ఓట్లు తొలగించేందుకు రంగం సిద్ధమైంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు తప్పొ ప్పుల్లేని ఓటరు జాబితాను రూపొందించడమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను చేపట్టింది. డూప్లికేట్ ఓటర్లతో పాటు మరణించినవారు, శాశ్వతంగా వలసలు పోయినవారు, అందుబాటులో లేని వారిని గుర్తించారు. ఈ ప్రక్రియ ప్రభావంతో పెద్ద సంఖ్యలో ఓటర్లను జాబితా నుంచి తొలగించే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఓటరు జాబితాలో భారీ ప్రక్షాళన చేపట్టినట్లు తెలుస్తుంది. శనివారం వరకు అందుబాటులో ఉన్న అధికారిక గణాంకాల ప్రకారం హనుమకొండ జిల్లాలో వివిధ కారణాలతో మొత్తం లక్షకు పైగా ఓట్లను తొలగించేందుకు అవకాశమున్న నేపథ్యంలో అది మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఒకేసారి పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగిపోతుండడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ భారీ మార్పు రాబోయే ఎన్నికల సమీకరణాలను మార్చే అవకాశం లేకపోలేదని ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తుంది. కాగా, జిల్లాలో ఎన్యుమరేషన్ ఫాంల ప్రక్రియ సైతం 97.42 వరకు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. కాగా ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును ఈ నెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పొడిగించారు. దీంతో ఈ నెల 17వ తేదీన ముసాయిదా జాబితా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా ప్రక్షాళనతో భారీ సంఖ్యలో ఓటర్లు తగ్గే అవకాశం కనిపిస్తుంది. బీఎల్వోల క్షేత్ర స్థాయి పరిశీలనలో మరణించిన వారు, ఒకే వ్యక్తికి డబుల్ ఓట్లు ఉండడం, శాశ్వతంగా వలస పోయినవారు అందుబాటులో లేని వారు, ఇతరులను అధికారులు గుర్తించారు. హనుమకొండ జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ రెండు నియోజక వర్గాల పరిధిలో మొత్తం 5,09,014 మంది ఓటర్లు ఉన్నారు. వీరి నుంచి లక్షకు పైగా ఓట్లు తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. వీరిలో మరణించిన వారు 14,604, శాశ్వతంగా షిప్ట్ అయినవారు 73,800, డబుల్ ఓటర్లు 8,211, అందుబాటులో లేనివారు 2,410, ఇతరులు 129 మంది ఉన్నట్లు గుర్తించారు. అయితే ప్రక్రి య పూర్తయ్యే వరకు ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా అత్యధిక ప్రభావం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంపై పడింది. ఈ నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు 80,088 మంది ఉండగా, ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగింపునకు రావడం రాజకీయ పార్టీల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకుంటుండడంతో ఆయా పార్టీలు కూడా ఈ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాయి. తమ కార్యకర్తల ద్వారా ఓటర్ల వివరాలను పరిశీలించి, అర్హుల పేర్లు తొలగిపోకుండా చర్యలు చేపడుతున్నాయి. ముసాయిదా జాబితా విడుదల తర్వాత జిల్లాలో ఓటర్ల సంఖ్యలో ఎంత మేర మార్పు వస్తుందనే అంశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటికే కొనసాగుతున్న ఇంటింటి సర్వే, ఓటర్ల వివరాల పరిశీలన ప్రక్రియకు గడువును 10వ తేదీ వరకు పొడిగించింది. అలాగే ఆగస్టు 3న విడుదల కావాల్సిన ముసాయిదా ఓటర్ల జాబితా (డ్రాఫ్ట్ పబ్లికేషన్)ను ఆగస్టు 17న చేయనున్నారు. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా వెల్లడించనున్నారు. కాగా ఎన్నికల సంఘం షెడ్యూల్ పొడిగింపు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఓటర్లకు తమ వివరాలను సరిచేసుకునేందుకు, కొత్తగా నమోదు చేసుకునేందుకు మరింత సమయం లభించనుంది.