సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 6: రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తన అనుచరులతో హరిశ్‌రావుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు నియోజకవర్గ స్థితిగతులపై చర్చించారు.
అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత మొదలైందని, తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి నర్సింహులు, మాజీ జడ్పీటీసీ మనోహర్‌గౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.