నర్సాపూర్,ఫిబ్రవరి 9 : హామీలతో మోసం చేసిన కాంగ్రెస్, నర్సాపూర్‌లో అభివృద్ధి చేయని బీజేపీని మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని మా జీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అధ్యక్షతన సోమవారం కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సాపూర్ మున్సిపాలిటీలో ఎగిరేది బీఆర్ఎస్ జెండా అని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు నర్సాపూర్ పట్టణానికి వారం రోజులకు ఒక సారి నీరు వచ్చేదని, బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో మిషన్ భగీరథ ద్వారా రోజూ ఇంటింటికీ నీరు వస్తుందన్నారు. మ్యానిఫెస్ట్టోలో లేకున్నా సంక్షేమ పథకాలను అమలుచేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.
ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేని మోసపూరిత ప్రభుత్వం కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి రేవంత్‌రెడ్డికి బుద్ధిచెప్పాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల కరెంట్‌ను 12 గంటలు చేశారని, నర్సాపూర్ సబ్‌స్టేషన్‌లో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డితో కలిసి ఇటీవల లాగ్‌బుక్ పరిశీలించగా, 12 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నట్లు ఉందని గుర్తుచేశారు. నర్సాపూర్‌లో యూరియా కోసం రైతులు ఎంత ఇబ్బందులు పడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు. రైతన్నలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి,ఒక్క పని చేయని బీజేపీకి ఎందుకు ఓటువేయాలని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముస్లింల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెదక్, దౌల్తాబాద్‌లో మత ఘర్షణలు జరిగాయన్నారు.బీజేపీ వైఫల్యం వల్ల పెట్రోల్, డీజిల్, నిత్యావసర ధరలే కాకుండా బంగారం ధరలు కూడా పెరిగాయన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో ఇండోర్ స్టేడియం, వెజ్అండ్ నాన్‌వెజ్ మార్కెట్, మున్సిపల్ భవనం, దోబీగాట్, రాయారావు చెరువు సుందరీకరణ, కోమటికుంట, డబుల్ బెడ్రూమ్ తదితర వాటికి బీఆర్ఎస్ హయాంలో నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆపిందని గుర్తుచేశారు.
మంత్రి వివేక్ నియోజకవర్గం చెన్నూర్‌లో బీఆర్ఎస్ గెలుస్తుందని, నర్సాపూర్‌కు వచ్చి ఇక్కడి ప్రజలకు ఆయన నీతులు చెబుతున్నాడని మండిపడ్డారు. చెన్నూర్‌లోనే తట్టెడు మట్టి ఎత్తలేని మంత్రి వివేక్ మాటలు నర్సాపూర్ ప్రజలు ఎలా నమ్ముతారని గుర్తుచేశారు. కారు గుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్‌గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, జడ్పీ కో-ఆప్షన్ మాజీ సభ్యుడు మన్సూర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శశిధర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, గోపి, శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు, బీఆర్ఎస్ శ్రేణులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.