పటాన్చెరు, జూన్ 27: ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 142 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన ఆటో డ్రైవర్లు మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ నెలకు రూ.12 వేల జీవనభృతి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే మాట తప్పిందన్నారు.
ఆటో డ్రైవర్లు చనిపోతే వారి కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం చేయాలని డిమాం డ్ చేశారు. ఆటో కార్మికులకు రెండేళ్లుగా ఒక్కొక్కరికి రూ.24 వేలు బాకీ పడ్డారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం భద్రత కలిపించాని, ఆటో కార్మికుల కోసం బీఆర్ఎస్ ఎప్పుడు ముందు ండి పోరాటం చేస్తుందన్నారు. కేసీఆర్ ఆటో కార్మికులకు అండగా ఉండి సమస్యల పరిష్కా రం కోసం పోరాటం చేస్తారన్నారు. అసెంబ్లీ వేదికగా ఆటో కార్మికుల పక్షాన ప్రశ్నించామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత ఆటో కార్మికులకు కష్టాలు మొదలయ్యాయని గుర్తుచేశారు. కుటుంణ పోషణ భారంగా మారి ఎంతోమంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ఆటోలు నడవక బ్యాంకు, ఫైనాన్స్ నుంచి తీసుకున్న రుణాలు చెల్లించలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలపై మాట్లాడడం లేదన్నారు. ఆటో కార్మికుల ఆత్యహత్యలు ముమ్మాటికీ కాంగ్రెస్ హత్యలే అని ఆరోపించారు. బీఆర్ఎస్ పటాన్చెరు నాయకుడు శ్రీకాంత్‌గౌడ్‌తో పాటు ఆటో కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.