సిద్దిపేట, డిసెంబర్ 7: గ్రామాల్లో ప్రజలు ఐక్యతతో ఉంటే ఏదైనా సాధించవచ్చని, ఇందుకు నిదర్శనంగా బొగ్గులోని బండ (పాండవపురం) చెప్పవచ్చని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం బొగ్గులోని బండ గ్రామం సర్పంచ్ స్థానాన్ని గ్రామస్తులు ఏకగ్రీవం చేశారు. ఏకగ్రీవ సర్పంచ్ అందె శంకర్, గ్రామస్తులు ఆదివారం మాజీ మంత్రి హరీశ్‌రావును సిద్దిపేటలో కలిశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. బొగ్గులోని బండ గ్రామస్తులు ఐక్యతను చాటారని అభినందించారు. ఐక్యతతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని, అందరు కలిసి కట్టుగా ఉండాలని సూచించారు. గ్రామాభివృద్ధి తోడ్పాటు అందిస్తానని, గ్రామాన్ని ఆదర్శంగా నిలిపేలా కొత్త పాలకవర్గం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్, గ్రామస్తులకు హరీశ్‌రావు అభినందించి, సన్మానించారు.