సిద్దిపేట, మార్చి 16: సిద్దిపేట అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి అడ్డుకుంటున్నదని, ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 184 మంది లబ్ధ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలన ఎలా ఉండేదో, ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉందో ప్రజలకు బాగా అర్థం అయ్యిందన్నారు.
కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో మళ్లీ కరెం ట్ కష్టాలు మొదలైనట్లు తెలిపారు. ప్రజలకు అనేక హామీలు, ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇచ్చిన హామీలను ఆమలు చేయడం లేదన్నారు. ఆరు గ్యారెంటీలకు అతీగతి లేకుండా పోయిందన్నారు. రూ.4వేల పింఛన్ చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి, కేసీఆర్ ఇచ్చిన రూ.2వేల పింఛన్ రెండు నెలలు ఎగ్గొట్టాడని విమర్శించారు.
15 నెల లు గడిచినా రూ.4 వేల పింఛన్ ఊసేలేదన్నారు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగా రం, మహాలక్ష్మి కింద మహిళలకు రూ. 2500 ఇస్తామని చెప్పిన మాటలు ఉత్తవి అయ్యాయని విమర్శించారు. రైతులకు రూ. 15 వేలు రైతుభరోసా అని చెప్పి వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టారన్నారు. రేవంత్‌రెడ్డి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మాటలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నాడని హరీశ్‌రావు విమర్శించారు. పేదల కోసం కేసీఆర్ ఎప్పుడూ ఆలోచించారని, కరోనా సమయంలోనూ రైతుబంధు ఆపలేదని, పింఛన్ ఠంచన్‌గా ఇచ్చారని హరీశ్‌రావు గుర్తుచేశారు.
సీఎం రేవంత్ సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. సిద్దిపేట వెటర్నరీ కాలేజ్ కొడంగల్‌కు తరలించుకు పోయాడని, నర్సింగ్ కళాశాల, వెయ్యి పడకల దవాఖాన, రంగనాయక సాగర్ టూరిజం, శిల్పారామం, పోలీస్‌స్టేషన్ పనులు ఆపారని విమర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో గళం విప్పుతానని పేర్కొన్నారు.
ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ బాగా పడిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ ప్రాజెక్టులు కట్టి రైతులకు నీరందిస్తే, బుద్ధిలేని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పంటలు ఎండబెట్టిందని హరీశ్‌రావు విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, కొండం సంపత్‌రెడ్డి, ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.