సిద్దిపేట, డిసెంబర్ 26: యాసంగిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పొలాలకు నీరు అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు నీటిపారుదలశాఖ అధికారులను కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నీటిపారుదలశాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత యాసంగిలో ప్రభుత్వం సరైన ప్రణాళిక రూపొందించక రైతుల పొలాలకు నీరు అందించలేదన్నారు. సొంత డబ్బులు ఇచ్చి తాతాలిక కాల్వలు తీసి నీరు అందించే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ యాసంగి వరకు శాశ్వత కాల్వలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అవసరమైన భూసేకరణ చేపట్టాలని, కాల్వల నిర్మాణానికి కావాల్సిన నిధులు ఇవ్వాలని ఫోన్లో సిద్దిపేట కలెక్టర్ హైమావతిని కోరారు. యాసంగిలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. ఇరోడ్, చందలపూర్లో నిర్మించే లిఫ్ట్ పనులు వేగవంతం చేయాలని సూచించారు.. సిద్దిపేట నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న చెక్‌డ్యామ్ పనులు త్వరగా చేపట్టాలన్నారు. కాల్వల్లో పేరుకుపోయిన పూడిక తీయించాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఈఈ గోపాలకృష్ణ, ఈఈ శంకర్, డీఈ చంద్రశేఖర్,శిరీష, వినయ్, ఆంజనేయులు, విద్యాసాగర్, వెంకటేశ్ పాల్గొన్నారు.