సిద్దిపేట, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీ పడింది? ఒక్కో మహిళకు ఎంత బాకీ పడింది? ఒక్కో రైతుకు ఎంత బాకీ పడింది? ఒక్కో ఇంటికి ఎంతబాకీ పడ్డదో తెలిసేలా బాకీ కార్డు విడుదల చేస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారంతా దసరా పండుగకు పల్లెలకు వస్తారు, వారికి తెలిసేలా ఈ కార్డులు పంపిణీ చేయాలని బీఆర్ఎస్ క్యాడర్‌కు ఆయన పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన కాంగ్రెస్ పార్టీ బాకీకార్డు విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సిద్దిపేట నియోజకవర్గ ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఇంటికీ కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ చేయాలన్నారు.గ్రామ నాయకులు, గ్రామశాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి బాకీకార్డు అందజేసి కాంగ్రెస్ పార్టీ ఆఇంటికి ఎంత బాకీ పడిందో వివరించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో మోసాలను ఎండగట్టాలన్నారు. ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలని చెప్పారు. నేడు సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ బాకీకార్డు పంపిణీ చేయాలని క్యాడర్‌కు సూచించారు.
ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ రూ.75 వేల రైతుబంధు బాకీ పడిందన్నారు. ప్రతి మహిళకు బాకీ పడ్డ రూ.55 వేలు ఇచ్చి కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడగాలన్నారు. రైతుబంధు ఇప్పుడైతే పదివేలు, మేము వస్తే పదిహేను వేలు ఇస్తామన్నారు..ఏమి ఇచ్చారు అని సూటిగా ప్రశ్నించారు.రైతు బంధు రైతు,కౌలు రైతుకు ఇస్తామని చెప్పినా ఒక రూపాయి అయినా కౌలు రైతుకు ఇచ్చా రా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కరోనా వచ్చినా కేసీఆర్ ఎమ్మెల్యేలు, మంత్రుల జీతా లు బంద్ పెట్టాడు కానీ రైతులకు రైతుబంధు ఆపలేదన్నారు. రూ.2 00 ఉన్న పింఛన్‌ను కేసీఆర్ రూ.200 0 చేశాడని, పదింతులు పింఛన్ పెంచి ండు కేసీఆర్ అని చెప్పారు. కాంగ్రెస్ రూ.40 00ల పింఛన్ ఇస్తామని ఈరోజు వరకు ఇవ్వలేదన్నారు. రేవంత్‌రెడ్డివి అన్నీ గజినీకాంత్ మాటలని విమర్శించారు.100 రోజుల్లో ఇస్తామని చెప్పి 700 రోజులైనా ఇప్పటి వరకు ఒక హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు.
గ్రామాల్లో పండుగ పూట కనీసం బల్చులు వేయలేని దద్దమ్మ ప్రభుత్వం అని హరీశ్‌రావు మండిపడ్డారు. కనీసం కేసీఆర్ కొనిచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోయలేకపోతున్నాడు రేవంత్‌రెడ్డి అని అన్నారు. గ్యారెంటీలకు టాటా చెప్పిండు.. లంక బిందెలకు వేట పట్టిండన్నారు. కేసీఆర్ ఉండగా ఎట్లుండే తెలంగాణ, రేవంత్‌రెడ్డి పాలనలో ఎట్లయ్యింది తెలంగాణ అని ప్రజలకు వివరించాలన్నారు. గోదావరి నీళ్లు కాళేశ్వరం ద్వారా కాల్వల్లో పారుతుంటే కళ్లుండి చూడలేని కబోదులు కాంగ్రెస్ నాయకులు అన్నారు. కాంగ్రెస్ ప్రజలను దగా, మోసం చేస్తుందని వివరించాలన్నారు.
సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కాంగ్రెస్ బాకీ కార్డు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ప్రతి గ్రామంలో పార్టీ క్యాడర్ నేడు (బుధవారం) ఇంటికి వెళ్లి పంపిణీ చేయనున్నారు. హరీశ్‌రావు సైతం కొన్ని గ్రామాల్లో పాల్గొననున్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీకి స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మా్రస్త్రం. ఇది కాంగ్రెస్ పాలిట ఉరితాడు అవుతుందని హరీశ్‌రావు చెప్పారు.యూరియా బస్తాలు ఇచ్చే తెలివి లేదు. కానీ, ఊరుకో మద్యం దుకాణం, బ్రూవర్లు, బెల్ట్‌షాపులు పెడతారట. మొత్తానికి తాగుబోతుల తెలంగాణ చేస్తా అంటున్నడు రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. ప్రియాంకగాంధీ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిరుద్యోగ భృతి రూ.4000 ఇస్తామన్నారు ఇచ్చారా..? రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని రాహుల్‌గాంధీ అశోక్‌నగర్ చౌరస్తాలో చెప్పిండు.నిజమే అని నిరుద్యోగ యువతీ యువకులు నమ్మితే వారిని రాహుల్‌గాంధీ మోసం చేశాడన్నారు. జాబ్ క్యాలెండర్ జాబ్‌లెస్ క్యాలెండర్ అయ్యిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎంత బాకీ పడిందో స్పష్టంగా బాకీకార్డు ద్వారా గుర్తు చేయాలని పిలుపునిచ్చారు.మార్పు మార్పు అన్నాడు ఏమైనా మార్పు వచ్చిందా…? ఏంలేదన్నారు. కేసీఆర్ చీరలు ఇచ్చారు నేను పట్టుచీరలు ఇస్తా అన్నాడు…పట్టుచీర లేదు ఉన్న చీర కూడా ఇవ్వలేదని చెప్పారు. మార్పు కాదు ఇది ఏమార్పు… నమ్మించి ఏమార్చి గొంతు కోసిండు రేవంత్‌రెడ్డి అని విమర్శించారు.