చేర్యాల/దుబ్బాక/సంగారెడ్డి/మద్దూరు(ధూళిమిట్ట), నవంబర్ 10: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ సోమవారం మరణించడంతో జిల్లాకు చెందిన ప్రముఖులు, సాహితీవేత్తలు, ప్రజలు ప్రగాఢ సంతాపం తెలిపారు. అందెశ్రీ మరణం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం సికింద్రాబాద్ లాలాగూడ మున్సిపల్ స్టేడియంలో అందెశ్రీ పార్థివ దేహానికి హరీశ్‌రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
అందెశ్రీ సాహితీరంగంలో తనదైన ముద్ర వేశారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. అందెశ్రీ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం సమర్పించి నివాళులర్పించారు. అనంతరం కు టుంబ సభ్యులను పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకులు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, మంద యాదగిరి, గదరాజు యాదగిరి తదితరులు నివాళులర్పించారు. జయజయహే తెలంగాణ పాటతో తెలంగాణ ఉద్యమంలో జనాన్ని చైతన్యం చేసిన అందెశ్రీ మృతి తీరని లోటని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఒక ప్రకటనలో ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అందెశ్రీ మృతి రాష్ర్టానికి తీరని లోటని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీతో ఏర్పడిన పరిచయం, అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో తన పాటలతో, సాహిత్యంతో అందెశ్రీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
