జహీరాబాద్, జనవరి 1: రేజింతల్ సిద్ధి వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రేజింతల్ సిద్ధి వినాయకస్వామి 225వ జయంతోత్సవాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్ణకుంభంతో పూజారులు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో పుష్పార్చన, హారతి తదితర ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ సిద్ధి వినాయక స్వామివారి 225వ జయంతోత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వయంభువుడిగా వెలిసిన సిద్ధివినాయక స్వామి దర్శనానికి వచ్చే భక్తులు కోరిన కోర్కెలు నెరవేర్చుతున్నారన్నారు. ఇలాంటి విశిష్టత ఉన్న సిద్ధి వినాయకుడిని మరెక్కడా మనం చూసి ఉండమన్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన భక్తులు ఇలవేల్పుగా మారిన స్వామివారిని దర్శించుకునేందుకు పెద్దఎత్తున తరలివస్తుంటారన్నారు.
గులాబీ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో సిద్ధివినాయక ఆలయ అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నా రు. ప్రతి సంవత్సరం ఆలయంలో జరిగే స్వామివారి జయంతోత్సవాలకు హాజరవుతుంటానని, ఈసారి కూడా హాజరై పుష్పార్చనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
రేజింతల్ సిద్ధి వినాయక స్వామి జయంతోత్సవాలకు హాజరయ్యేందుకు వచ్చిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు జహీరాబాద్ పట్టణ సమీపంలోని రంజోల్ బైపాస్‌లో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు నాయకులు, కార్యకర్తలు, భక్తులు పోటీపడ్డారు. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ సెల్ఫీలు దిగారు.
అనంతరం జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీజైపాల్‌రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జహీరాబాద్, ఝరాసంగం, కోహీర్, మొగుడంపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ అధ్యక్షులు తట్టు నారాయణ, వెంకటేశం, నర్సింహులు, సంజీవ్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మచ్చేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లాడి నర్సింహులు, నాయకులు నామ రవికిరణ్, గుం డప్ప, విజయ్‌కుమార్, స్వప్నాభాస్కర్, నర్సింహారెడ్డి, ప్రవీణ్‌కుమార్, హీరూరాథోడ్, మల్లారెడ్డి, రాజేందర్‌రెడ్డి, రవికుమార్, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, మహిపాల్, చంద్రన్న, వీరారెడ్డి, భూంరెడ్డి, తుక్కారెడ్డి, మాణిక్ రెడ్డి, సుధాకర్‌రెడ్డి, అశోక్‌పాటిల్, చంద్రశేఖర్ రెడ్డి, అశోక్ పాల్గొన్నారు.