సిద్దిపేట రూరల్ మండలం అంకంపేట, సీతారాంపల్లి గ్రామాల్లో వందల ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోయాయి. ఈ రెండు గ్రామాలే కాదు ఏ ఊరిలో చూసినా వరిపొలాలు ఎండిపోయి కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడూ చెరువుల్లో నీళ్లు ఉండేవి. దీంతో రైతులకు సాగునీటి కష్టాలు ఎదురుకాలేదు. ప్రస్తుతం చెరువులు, చెక్‌డ్యామ్‌లు, కాలువలే కాకుండా రిజర్వాయర్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. దీనికి తోడు బోరుబావుల్లో నీరు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో యాసంగి పంటలు గట్టెక్కడం కష్టమే అనిపిస్తున్నది.
‘ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు’.. అన్న నానుడి వాడుకలో ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అలాగే ఉంది. ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేకపోవడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. సాగునీటి విడుదలలో ప్రభుత్వ తాత్సారం,్ర పణాళికాలేమి రైతుల పంటలు ఎండేలా చేస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లు ప్రస్తుతం అన్ని ఖాళీ అవుతున్నాయి. నీటిని ఒక పద్ధ్దతి ప్రకారంగా విడుదల చేయక పోవడంతో చెరువులన్నీ అడుగంటాయి. బీఆర్ఎస్ హయాంలో ఒక ప్రణాళిక ప్రకారం సాగునీటిని విడుదల చేసేవారు. ప్రతి చెరువును నింపడంతో రైతులకు సాగునీటి కష్టాలు ఎదురుకాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఆ పరిస్థితి లేదు.
సిద్దిపేట, మార్చి 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఇప్పుడే పంట పొలాలు ఎండిపోతున్నాయి. రిజర్వాయర్లు ఉన్నా నీటిని సరిగా విడుదల చేయక పోవడం కారణంగా ఎక్కడికక్కడ చెరువులు నెర్రలుబారి దర్శనమిస్తున్నాయి. ఫలితంగా భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. బోరుబావుల్లో నీటి ఊటలు పూర్తిగా పడిపోయాయి. వరి పొట్ట దశలోకి వచ్చింది.
ఈ సమయంలో తగినంత నీరు అందక ఎండుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 3 టీఎంసీ సామర్థ్యం కలిగిన రంగనాయక సాగర్‌లో ప్రస్తుతం 1.42 టీఎంసీల జలాలు మాత్రమే ఉన్నాయి. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకుంటున్నది. 30 టీఎంసీల సామర్థ్యం కలిగిన మల్లన్న సాగర్‌లో ప్రస్తుతం 13.9 టీఎంసీలు, 15 టీఎంసీల సామర్థ్యం కలిగిన కొండపోచమ్మ సాగర్‌లో 7.21 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వాయర్లకు అదనపు జలాలను పంపింగ్ చేస్తేనే ఆయకట్టు కింద పంట పొలాలు దక్కే అవకాశం ఉంటుంది.
మిడ్‌మానేరు నుంచి నీటిని విడుదల చేసి రంగనాయక సాగర్‌కు, రంగనాయక సాగర్ నుంచి మల్లన్నసాగర్‌తో పాటు ఇతర ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రణాళికా ప్రకారం ప్రభుత్వం నీటిని విడుదల చేయక పోవడంతో నీటి ఎద్దడి సమస్య ఉత్పన్నమవుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో సాగునీటి కోసం నిత్యం రైతులు రోడ్డెక్కుతున్నారు.
నీటిపారుదల శాఖ అధికారుల తీరును రైతులు ఎండగడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో సాగునీరు విడుదల చేసినారంటే క్రమ పద్ధ్దతిలో అన్ని ప్రాంతాలకు నీళ్లు వచ్చేవని రైతులు చెబుతున్నారు. ఇవ్వాళ రైతులు ధర్నా చేస్తేనే నీటిని విడుదల చేస్తున్నారు. ఎక్కడ చూసినా సాగు నీటికి ఎదురు చూపులు తప్పడం లేదు. కొన్నిచోట్ల రైతులు పంట పొలాలు ఎండి పోవడంతో పశువులను మేపుతున్నారు. మరికొన్ని చోట్ల పంట పొలాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు.
బోరుబండ్లు, క్రేన్లకు డిమాండ్…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎక్కడ చూసినా బోరు బండ్లు కనిపించేవి. కేసీఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు బోరుబావులు తవ్వించే పరిస్థితి కాని, బావుల మీద క్రేన్లు కనిపించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. ప్రస్తుతం పొలాలను రక్షించుకోవడానికి రైతులు బోర్లు వేయిస్తున్నారు. ఒక్కో రైతు రెండు మూడు అంతకన్నా ఎక్కువగానే బోర్లు వేయిస్తున్నారు.
700 ఫీట్ల వరకు బోరు తవ్వించినా నీరు రావడం లేదు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల తదితర ప్రాంతాల్లో ఎటు చూసినా బోరు బండ్లు కనిపిస్తున్నాయి. మరోవైపు బావుల పూడికతీతతో పాటు బావులను లోతు చేయిస్తుండగా రైతులు అప్పుల పాలవుతున్నారు. బోర్లలో నీరు రాక పంట ఎండిపోవడంతో పశువులను మేపుతున్నారు.
రెండెకరాల పొలం ఎండింది..
నాకున్న మూడెకరాల్లో యాసంగిలో వరిపంట వేసిన. మా ఊరి చెరువులో నీళ్లు రాకపోవడంతో రెండెకరాల పొలం ఎండింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఊరి చెరువులోకి మంచిగా నీళ్లు వచ్చేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మా చెరువు కింది పొలాలు ఎండిపోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎండిపోతుంటే మాకు కన్నీళ్లు వస్తున్నాయి.
– గజ్జల నరేశ్, రైతు, అంకంపేట
మా చెరువులో నీళ్లు లేవు..
నాకు ఆరెకరాల పొలం ఉంది. యా సంగి పంటకు నీళ్లు రాకపోవడంతో నా పొలం నాలుగెకరాలు పూర్తిగా ఎండిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మల్లన్న సాగర్ నుంచి మా చెరువులోకి నీళ్లు ఎప్పుడూ వచ్చేవి. చాలా ఏండ్ల పాటు మా చెరువు ఎండిపోలేదు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీళ్లకు, కరెంట్‌కు మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు మోటర్లు కూడా కాలిపోతున్నయి.
-భగవాన్ రెడ్డి, రైతు, అంకంపేట
పొలం పూర్తిగా ఎండిపోయింది..
మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. మాకు ఐదెకరాల పొలం ఉంది. ప్రతి సారి యాసంగిలో వరి పంట సాగుచేస్తాం. ఈసారి సాగు చేసిన పంట నీళ్లు లేక పూర్తిగా ఎండి పోయింది. పెట్టుబడులు తడిసి మోపెడు అయ్యాయి. అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మా రైతులను నట్టేట ముంచింది.
– ఆకునూరి నర్సయ్య, రైతు, సీతారాంపల్లి