సిద్దిపేట/నారాయణరావుపేట, మార్చి 23: వడగండ్ల వానతో చాలా గ్రామాల్లో పంట నష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను గుర్తించి ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం చేసి ఆదుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లిలో శనివారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు నష్టపోయిన రైతు ఎల్కపల్లి నర్సింలు వరి పంటను, రైతు రామస్వామి బొప్పాయి తోటను ఆదివారం హరీశ్‌రావు పరిశీలించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్నివిధాలుగా దగా చేస్తున్నదని విమర్శించారు.
వరంగల్ డిక్లరేషన్‌లో చాలా మాటలు చెప్పి అమలు చేయడం లేదన్నారు. రూ.2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో హామీఇచ్చి సంపూర్ణంగా చేయలేదన్నారు. రూ.2లక్షలకు పైన రుణం ఉన్న రైతులతో పైన డబ్బులు చెల్లించి రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఊరికి పోయి చూసినా సగం మంది రుణమాఫీ కాని రైతులు కనిపిస్తున్నారని, రైతులను ప్రభుత్వం మోసం చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
రైతుబంధు రూపంలో కేసీఆర్ రైతులకు నేరుగా సహాయం చేశాడని, 11 విడతల్లో రూ.73 వేల కోట్లు రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేసినట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుభరోసా ఎకరాకు రూ.7500 చొప్పున వానకాలం, యాసంగి పంటలకు సంబంధించి రూ. 15 వేల చొప్పున వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలకు బోనస్ క్వింటాలుకు రూ.500 ఇస్తామని చెప్పి బోగస్ చేశారని విమర్శించారు. పంటల బీమా అని చెప్పి రూ.1300 కోట్లు బడ్జెట్లో పెట్టారని, కానీ.. రైతులకు మూడు పంటలకు బీమా రాలేదన్నారు.
రైతులకు రూపాయి సహాయం ప్రభుత్వం అందించలేదని విమర్శించారు. బీమా ఉండి ఉంటే రైతులకు ఇంత నష్టం జరిగేది కాదన్నారు.ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.10వేలు ఇచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారని, సిద్దిపేట జిల్లాలో పోయిన ఏప్రిల్‌లో వడగండ్ల వాన లు, పోయిన ఏడాది మేలో వడగండ్లు పడి నష్టపోయిన రైతులకు ఒక్క రూపాయి కాంగ్రెస్ ప్రభుత్వం సహాయం చేయలేదని హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వం అబద్ధ్దాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. రుణమాఫీపై అసెంబ్లీ సాక్షిగా మంత్రులు అబద్ధాలు ఆడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ రైతుల పాలిట బట్టేబాజ్ పార్టీ అని హరీశ్‌రావు విమర్శించారు.
ఎండల వల్ల పంటలు ఎండుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి కొత్త కథలు చెబుతున్నాడని, ఆయన వచ్చాకే ఎండలు కొట్టాయా, ఆయన అసమర్థ పాలనతోనే పంటలు ఎండుతున్నాయని హరీశ్‌రావు విమర్శించారు. సకాలంలో ప్రాజెక్టుల మోటర్లు ఆన్‌చేసి జలాలు పంపింగ్ చేసి ఉంటే పంటలు ఎండేవి కాదన్నారు. ఒక్క వరంగల్ జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, దీనికారణం కాంగ్రెస్ వైఫల్యం అని ధ్వజమెత్తారు. దేవాదుల మోటర్లు 35 రోజులు చాలు చేయకపోవడంతో వరంగల్ జిల్లాలో రూ. 600కోట్ల విలువైన పంటలు ఎండిపోయినట్లు తెలిపారు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో ఎండలు కొట్టలేదా అని ప్రశ్నించారు. నాడు కేసీఆర్ మండుటెండల్లో చెరువులు, చెక్‌డ్యామ్‌లు, వాగులు, కాలువల్లో నీళ్లు పారించారని, రైతులకు నీళ్లు ఇచ్చి పంటలు రక్షించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరద వచ్చినప్పుడు దిక్కులు చూసి నీళ్లను కిందికి వదిలి ఇప్పుడు రైతుల ఉసురు పోసుకుంటున్నట్లు విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలని హితవు పలికారు. వరంగల్ డిక్లరేషన్ చెప్పిన హామీలు ఇక్కటి నెరవేర్చలేదన్నారు.
సిద్దిపేట,మెదక్ జిల్లాల్లో వడగండ్ల వాన తీవ్రతతో ఎక్కువగా పంటనష్టం జరిగిందని, ప్రభుత్వం వెంటనే సర్వేచేయించి బాధిత రైతులను ఆదుకోవాలని హరీశ్‌రావు డిమాం డ్ చేశారు. వడ్లు రాలిపోయినవే పంట నష్టం కింద రాస్తామని అధికారులు అంటున్నారని, పొట్ట దశకు వచ్చిన వరిపై వడగండ్లు పడడంతో గింజ పెట్టక తాలు వస్తుందని, అలాంటి వాటికి ఇన్పుట్ సబ్సిడీ కింద సహాయం అందించేలా అధికారులు చొరవ చూపాలని హరీశ్‌రావు కోరారు. కార్యక్ర మంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, సుడా మాజీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, లక్ష్మిదేవిపల్లి మాజీ సర్పంచ్ బొంగురం మంజులాశ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీపీ బాలకృష్ణ, మాజీ ఎంపీటీసి దండు సప్న ప్రభాకర్, నాయకులు ఎల్లారెడ్డి, మాజీ సర్పంచ్‌లు ఆంజనేయులు, పరశురాములు, నారాయణ, శంకర్, బాల్‌రెడ్డి, పాల్గొన్నారు.