సిద్దిపేట, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): “మనోహరాబాద్ – కొత్లపల్లి రైల్వే ఏర్పాటుకు కావాల్సిన మొత్తం భూసేకరణ, అయ్యే ఖర్చులో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందనే అగ్రిమెంట్‌కు అనుగుణంగా ఇప్పటికే రూ.500 కోట్లు ఖర్చు చేశాం. సిద్దిపేట రైల్వే కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారు. మార్చిలో దుద్దెడకు, ఏప్రిల్, మేలోపు సిద్దిపేటకు రైలు వచ్చేలా వేగంగా పనులు జరుగుతున్నాయి” అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు.
మంగళవారం సిద్దిపేట రైల్వేస్టేషన్ స్థలం నుంచి నిర్మాణంలో ఉన్న దుద్దెడ రైల్వేస్టేషన్ వరకు దాదాపు 11 కి.మీ మేర జరుగుతున్న రైల్వే ట్రాక్‌లైన్ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంత్రి వెంట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రైల్వే శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ సంతోష్‌కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సోమరాజు, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ జనార్దన్‌బాబు, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్అండ్బీఈఈ సుదర్శన్‌రెడ్డి, ఎస్ఈ ఎలక్ట్రిసిటీ ప్రభాకర్, ఇరిగేషన్ మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు ఉన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సిద్దిపేటకు రైల్వే ఏర్పాటు దశాబ్దాల కల అన్నారు. ఇప్పటికే ఫేజ్ -1 ద్వారా హైదరాబాద్ నుంచి మనోహరబాద్ మీదుగా గజ్వేల్ వరకు 44 కిలోమీటర్ల రైలు సేవలు ప్రారంభమయ్యాయన్నారు. రైల్వే రేక్ పాయింట్ ఏర్పాటు చేసి ఎరువులను తీసుకొచ్చి జిల్లాలోని అన్ని ప్రాంతాల రైతులకు సరఫరా చేస్తున్నామన్నారు. దీంతో ఎరువులను తీసుకురావడానికి సనత్‌నగర్ రేక్ పాయింట్‌కు వెళ్లాల్సిన శ్రమ తగ్గిందన్నారు. ఫేజ్ -2 ద్వారా గజ్వేల్ నుంచి సిద్దిపేట వరకు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
గజ్వేల్ నుంచి దుద్దెడ వరకు 21 కిలో మీటర్ల రైల్వే టాక్ నిర్మాణం పూర్తి కావస్తుందన్నారు. దుద్దెడ నుంచి సిద్దిపేటకు 11 కి.మీ పనులు జరుగుతున్నాయన్నారు. రైల్వేలైన్ ఏర్పా టు పనులను స్వయంగా పరిశీలించి మరింత వేగంగా జరిగేందుకు సిద్దిపేట నుంచి దుద్దెడ రైల్వేస్టేషన్ వరకు అధికారులతో కలిసి ట్రాక్ నిర్మాణ పనులను పరిశీలించినట్లు తెలిపారు. దుద్దెడ రైల్వేస్టేషన్ ద్వారా కలెక్టర్ కార్యాలయం, ఐటీ టవర్, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు వచ్చే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ఫేజ్ -3 ద్వారా సిరిసిల్ల నుంచి వేములవాడ మీదుగా కరీంనగర్ వరకు రైల్వేలైన్ పూర్తి కానుందన్నారు.
సిద్దిపేట రైల్వే కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారు
సిద్దిపేటకు రైల్వే కలను సీఎం కేసీఆర్ సాకారం చేశారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. 2005 -2006లో యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ మూలధనం వాటాగా మొత్తం ఖర్చు భరించి భూసేకరణ, రైల్వే ఏర్పాటుకు అవసరమైన నిధుల్లో మూడో వంతు సమకూర్చామ న్నారు. రైల్వే నిర్మాణం అనంతరం ‘ఐదేండ్ల పాటు రైల్వేకు వచ్చే నష్టాలను రాష్ట్ర ప్రభుత్వం భరించడం’ అనే అగ్రిమెంట్‌తో మనోహరాబాద్ నుంచి గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా కొత్తపల్లి కరీంనగర్ వరకు 151 కిలో మీటర్ల రైల్వేలైన్ మంజూరు చేయించారన్నారు.
కానీ 2014 వరకు ఎనిమిదేండ్లు రాష్ట్రంలో దివం గత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం వాటాగా నిధులు చెల్లించకపోవడం, భూసేకరణ చేయకపోవడం కారణంగా 2014 వరకు రైల్వే ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి పనులు ప్రారంభం కాలేదన్నారు. గతంలో ఎంపీలు గడ్డం వెంకటస్వామి, నంది ఎల్లయ్య, సర్వే సత్యనారాయణ సిద్దిపేటకు రైల్వే తీసుకొస్తామని చెప్పినా తీసుకురాలేదన్నారు. 2014లో తెలంగాణ రాష్ర్టా న్ని సాధించి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేసీఆర్ మనోహరబాద్ – కొత్తపల్లి రైల్వేలైన్ ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిధులు మంజూరు చేసి భూసేకరణ చేయడంతో రైల్వే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వేగంగా రైల్వే ఏర్పాటు పనులు జరుగుతున్నాయన్నారు. రైల్వే పనుల నిర్మాణంలో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఎంతో ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 500 కోట్లు ఖర్చు చేసింది
మనోహరాబాద్ – కొత్లపల్లి రైల్వే ఏర్పాటుకు కావాల్సిన మొత్తం భూసేకరణ, అయ్యే మొత్తం ఖర్చులో మూడో వంతు ఖర్చును భరిస్తుందనే అగ్రిమెంట్‌కు అనుగుణంగా ఇప్పటికే రూ.500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఖర్చు చేశామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 2,200 ఎకరాల భూసేకరణ పూర్తి చేశామన్నారు. మరో 300 నుంచి 350 ఎకరాల భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందన్నారు. వాటిలో మెదక్ జిల్లాలో 171 ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 1342 ఎకరాలు, సిరిసిల్ల జిల్లాలో 708 ఎకరాలు భూసేకరణకు కావాల్సిన మొత్తం ఖర్చును భరించి రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందన్నారు.
భూసేకరణకు మెదక్ జిల్లా పరికిబండ వద్ద ఫారెస్టు క్లియరెన్స్ సమస్య వస్తే అవసరమైన నిధులు ఖర్చు చేసి క్లియర్ చేశామన్నారు. మనోహరాబాద్ వద్ద నేషనల్ హైవే ఆర్వోబీ నిర్మాణానికి సమస్య వస్తే ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఢిల్లీలో ఉన్నతాధికారులను కలిసి పని పూర్తి చేశామన్నారు. రైల్వే పనులు జరగడానికి రైల్వేకు మరో రూ.100 కోట్లు రాష్ట్ర ప్రభు త్వం తరపున మంజూరు చేస్తామన్నారు. రైల్వేకు అందించిన రూ.500 కోట్లతో పాటు కుకునూరుపల్లి, మందపల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మా ణం, మిషన్ భగీరథ పైపులైన్లను మార్చడానికి, ఇరిగేషన్ కెనాల్స్ సరి చేయడానికి, కాళేశ్వరం ప్రాజెక్టు టన్నెల్, ఆడిట్స్ మార్చడం, విద్యుత్ టవర్లు మార్చడానికి, అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి మరిన్ని నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.
రైల్వేలైన్ ఏర్పాటుతో నష్టపోతున్న ప్రజలకు అవసరమైన ప్రాంతాల్లో ఇంటి స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇచ్చామన్నారు. రైల్వే శాఖ వారు పనుల్లో వేగం పెంచి డే నైట్ వర్క్స్ నిర్వహించి త్వరగా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఈ రైల్వేలైన్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజల రవాణాకు మార్గం సుగుమమై మరింత అభివృద్ధి చెం దుతుందన్నారు. ఈ రైల్వేలైన్‌లో గూడ్స్, ప్యాసింజర్ రైళ్లు నడుస్తాయన్నారు. భవిష్యత్‌లో ఈ లైన్ ఉత్తర, దక్షిణాది ముఖ్యమైన రైల్వేమార్గంగా రూపుదిద్దుకుంటుందన్నారు. సుమారు 75 కి.మీ దూరం తగ్గుతుందన్నారు. రైల్వేలైన్ నిర్మాణ పను ల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా జిల్లా యం త్రాంగం సహకరించడానికి సిద్ధంగా ఉందన్నారు. అధికారులతో కలిసి వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకొని ప్రతివారం ప్రగతిని పరిశీలిస్తున్నామన్నారు. సమస్యలు నేరుగా కలెక్టర్, ఆర్డీవోల దృష్టి కి తీసుకెళ్లాలని మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు.