జగదేవపూర్, జూన్ 1 : తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా సొంత డబ్బులతో స్థలం కొనుగోలు చేసి బీఆర్ఎస్ కార్యాలయం నిర్మించుకున్న ఏకైక గ్రామం తీగుల్ అని, ఈ గ్రామం యావత్ రాష్ర్టానికి, బీఆర్ఎస్కు ఆదర్శం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సొంతంగా నిర్మించుకున్న బీఆర్ఎస్ కార్యాలయం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆదివారం హరీశ్‌రావు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ వంటేరి యాదవరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేలేటి రాధాకృష్ణ శర్మతో కలిసి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. తీగుల్ గ్రామం గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. ఇక నుంచి ఏ గ్రామానికి వెళ్లినా తీగుల్ ప్రస్తావనా తీసుకొస్తానన్నారు. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ కార్యాలయాలు నిర్మించుకోవాలని, అందుకు ఆదర్శంగా తీగుల్ను తీసుకోవాలని సూచిస్త్తానన్నారు. తీగుల్ గ్రామం 2001 నుంచి తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిందని గుర్తుచేశారు. 2001 లో గ్రామంలో పార్టీ కార్యాలయం కోసం జాగ కొనుగోలు చేశారని, నేడు రజతోత్సవ వేళ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని హరీశ్‌రావు అన్నారు.
కార్యకర్తలు సొంత డబ్బులు వేసుకొని పార్టీ భవనం నిర్మించుకోవడం ఆదర్శం అన్నారు. తీగుల్‌కు గొప్ప చరిత్ర ఉందని, రజాకార్లకు ఎదురొడ్డి పోరాడిన గ్రామం తీగుల్ అని, 1969లో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ గ్రామం ముందు వరుసలో ఉన్నట్లు గుర్తుచేశారు. గ్రామానికి చెందిన కుమ్మరి బాలయ్య, మల్లారెడ్డి వంటి వారు జైతెలంగాణ అని నినదించినట్లు తెలిపారు. నేడు వారిని యువసేన యువజన సంఘం ఆదర్శంగా తీసుకొని ముందుకు రావడం అభినందనీయమని హరీశ్‌రావు అభినందించారు. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే దండం పెట్టాలని అనిపిస్తుందన్నారు. రేవంత్‌రెడ్డి మార్పు అని చెప్పి తెలంగాణ తల్లిని మార్చారని, తల్లిని మారిస్తే ఏమొస్తది అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చెబుతున్న రేవంత్, కేసీఆర్ చేసిన అభివృద్ధి మార్చగలడా అని హరీశ్‌రావు అన్నారు.
కాంగ్రెస్ అంటేనే మోసం చేసే పార్టీ అని ప్రజలకు తెలుసు అని, కానీ.. రేవంత్ రెడ్డి కళ్లబొల్లి మాటలు, మాయమాటలు నమ్మి ప్రజలు ఓటేశారని హరీశ్‌రావు అన్నారు. ప్రజల తలరాత మారుస్తా అని రేవంత్ మాటలు నమ్మి ఆయనన్ను గెలిపిస్తే ఇప్పుడు ఆగమయ్యిర్రు అన్నారు. కానీ, గజ్వేల్ ప్రజలు రేవంత్‌ను నమ్మలేదని, ఆయనకు ఓటేయ్యలేదని, బయట నియోజకవర్గాల ప్రజలు నమ్మి ఓటేసి ఇప్పుడు బాధపడుతున్నారని హరీశ్‌రావు అన్నారు. కానీ, ప్రజలు తొందరగానే రేవంత్ నైజం తెలుసుకున్నారని, ఇగ మాత్రం జన్మల కాంగ్రెస్ ఓటేయ్యం అంటుర్రు అని హరీశ్‌రావు అన్నారు.
రేవంత్ మాటలు నాలుగు నెలల్లోనే ప్రజలకు అర్థమయ్యిందని, ఆయనవి మాటలు ఎక్కువ.. పని తక్కువ అని ప్రజలు అర్థం చేసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ తల్లిని మారిస్తే ప్రజలకు ఒరిగేదేముంది అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రైతులకు వానకాలం రైతుభరోసా ఇయ్యలేదని, యాసంగి రైతుభరోసా రెండెకరాలకు ఇచ్చి నాన్చుతున్నారని, రుణమాఫీ ఏగ్రామంలో కూడా పూర్తిగా చెయ్యలేదని హరీశ్‌రావు విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వడ్ల కొనుగోలులో తరుగు తీస్తుండ్రు అని మొత్తుకున్న రేవంత్, ఇప్పుడు 7, 8కిలోల తరుగు తీస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.
సన్న వడ్లకు బోనస్ ఇస్తనని చెప్పిన మాటలు బోగస్ అయ్యాయని, రేవంత్ రూ. 1100 కోట్ల బోనస్ డబ్బులు బకాయి పడ్డాడని హరీశ్‌రావు విమర్శించారు. మహిళలకు ఏం చేయలే, యువకులకు ఏం చేయలే, అధికారంలో కి వచ్చిన వెంటనే 2లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి పది వేల ఉద్యోగాలిచ్చి, అన్నీ ఇచ్చినం అని అబద్ధ్దాలు చెబుతున్నట్లు విమర్శించారు. రేవంత్ ప్రభుత్వంలో ఏది కొన ఎల్తలేదని, ఏది మొదలుపెట్టినా కొన ఎల్లిందా అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ హయాంలో ప్రజలకు పథకాలు అందడం లేదని, కాంగ్రెస్ కార్యకర్తలకే రాజీవ్ యువవికాసం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ నాయకుల జేబులు నింపేందుకు రేవంత్ పథకాలు పెట్టారని, కానీ.. కేసీఆర్ హయాంలో ప్రజలందరికీ అన్ని పథకాలు అందాయని, పార్టీలకు అతీతంగా పథకాలు మంజూరు చేసినట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, రైతుబీమా, ఇలా అన్ని పథకాలు అర్హులందరికీ అందించినట్లు గుర్తుచేశారు, రేవంత్ హయాంలో బీసీబంధు, దళితబంధు, గొర్రెల పంపిణీ, మైనార్టీ కార్పొరేషన్ రుణాలు, అన్నీ బంద్ అయినట్లు హరీశ్‌రావు విమర్శించారు.
తీగుల్ గ్రామం ఉద్యమాల పురిటిగడ్డ అని, ఇక్కడ 2001 నుంచి ఒక్కటే గులాబీ జెండా ఎగిరిందని హరీశ్‌రావు అన్నారు. ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు ముందుండి నడిపించిన తీగుల్ గ్రామంపై ఎప్పుడూ తమకు ప్రేమ ఉంటుందని హరీశ్‌రావు అన్నారు. అందుకే ఈ గ్రామం నుంచి ఎవరు వచ్చినా అడిగింది కాదనకుండా అన్ని పనులు చేసినట్లు తెలిపారు. జీపీ భవనం, డబుల్ రోడ్డు, సర్కారు దవాఖాన, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి పనులు చేసుకున్నామని, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అమలు చేసుకున్నట్లు హరీశ్‌రావు గుర్తుచేశారు.
కేసీఆర్ ఉన్నప్పుడు భూముల విలువ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది అన్నారు. భూములు కొనేటోడు లేడని, అమ్మేటోడు లేదని, హైదరాబాద్ నుంచి భూములు కొనేందుకు ఏమన్నా కార్లు వస్తున్నయా, ఎవరన్నా భూములు కొనేందుకు సిద్ధంగా ఉన్నారా అని హరీశ్‌రావు అన్నారు. ఎవరన్నా పెండ్లికో, ఆపతికి సంపతికి భూమి అమ్ముతామంటే కొనేటోడు ప్రస్తుతం లేడని, దీంతో రిజ్రిస్టేషన్ కార్యాలయాల్లో ఈగలు కొట్టుకుంటున్నారని, ఇవ్వన్నీ రేవంత్ చేపట్టిన తుగ్లక్ పాలనతోనే రాష్ట్రం ఆగమైనట్లు హరీశ్‌రావు విమర్శించారు.
రాష్ట్రం దివాళా దీపిస్తుండని, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, కేసీఆర్ హయాంలో కోటి రూపాయలకు ఎకరం ఉన్న జాగ, ఇప్పుడు రూ.60, 70 లక్షలకు ఇస్తమన్నా కొనేటోళ్లు లేరు అని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ హయాంలో ఇండ్లు కడితే, ఇప్పుడు ఇండ్లు కుదవపెట్టి అప్పులు తెచ్చుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ రాష్ట్ర గౌరవాన్ని నిలవెడితే.. రేవంత్ పడకొడుతుండన్నారు. మునిగడప ప్రాంతంలో కేసీఆర్ హయాంలో 400 ఎకరాల్లో ఇండస్ట్రీ పెట్టి ఉద్యోగాలు ఇవ్వాలే అనుకున్నారని, కానీ.. రేవంత్ దాని ఊసే పట్టడం లేదన్నారు.
జగదేవపూర్‌లో రాబోయే రెండు మూడేండ్లలో పెద్దఎత్తున ఇండస్ట్రీలు పెట్టి యువతకు కచ్చితంగా ఉద్యోగాలు కల్పిస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. రేవంత్ పాలన అందరికీ అర్థమైందని, ఇప్పటికైనా ప్రజలు గమనించాలే అని, పచ్చి అబద్ధ్దాలు ఆడుతూ పబ్బం గడుపుతున్న రేవంత్‌కు, ఆయన ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హరీశ్‌రావు అన్నారు.
తీగుల్ గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బాల్‌రెడ్డి అందరికీ ఆదర్శంగా నిలిచారని మాజీమంత్రి హరీశ్‌రావు కొనియాడారు. రిటైరైన 20 ఏండ్ల నుంచి పైసా తీసుకోకుండా ఆయన విద్యార్థులకు ఉచితంగా పాఠాలు బోధిస్తున్నారని, ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన గ్రామం తీగుల్ అని అన్నారు. ఆయన్ను హరీశ్‌రావు శాలువాతో ఘనంగా సన్మానించారు. తీగుల్‌లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువసేనా యూత్ ఆధ్వర్యంలో నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయానికి అవసరమైన గ్రానై ట్, ఫర్నిచర్ తన సొంత డబ్బులతో ఇవ్వనున్నట్లు హరీశ్‌రావు ప్రకటించారు.
ఈ గ్రామానికి చెందిన సాంస్కృతిక కళాకారుడు పూసలి శ్రీను దళితరత్న డాక్టరేట్ పొందడంతో శాలువాతో హరీశ్‌రావు సన్మానించారు. జగదేవపూర్ మాజీ ఎంపీపీ బాలేశంగౌడ్ కాంగ్రెస్ నుంచి తిరిగి బీఆర్ఎస్లో చేరారు. ఆయనకు మాజీ మంత్రి హరీశ్‌రావు కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. అంతకుముందు గ్రామం లో ర్యాలీగా వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావు, నాయకులకు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, తీగుల్ మాజీ సర్పంచ్ సుధాకర్‌రెడ్డి, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బాలేశంగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ రంగారెడ్డి, కొండపోచమ్మ దేవాలయ కమిటీ మాజీ చైర్మన్లు శ్రీనివాస్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఎక్బాల్, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కవిత, ఎల్లారెడ్డి యువసేన అధ్యక్షులు ప్రకాశ్, ఎల్లయ్య, కోటయ్య, కనకయ్య, నాగరాజు పాల్గొన్నారు.