సిద్దిపేట, జనవరి 12: కాంగ్రెస్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్న తీరును ప్రజలకు తెలియజేయాలని, కాంగ్రెస్ దుర్మార్గ పాలనను ఎండగట్టాలని పార్టీ క్యాడర్‌కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో చిన్నకోడూరు మండలం యువజన విభాగం, విద్యార్థి విభాగం నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు, హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కారు అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. కేసీఆర్ అమలు చేసిన పథకాలను బంద్ పెట్టిందన్నారు.
పదేండ్ల పాటు సిద్దిపేటలో అభివృద్ధి పరుగులు పెట్టగా, ఏడాదిలో కాంగ్రెస్ ఆగంజేసిందన్నారు. సిద్దిపేట కాంగ్రెస్ నాయకలకు ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలు పట్టవా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రద్దు చేసిన పనులపై మీ వైఖరి ఏంటో చెప్పాలన్నారు. చిన్నకోడూరు రోడ్డు పనులు, నర్సింగ్ కళాశాల పనులు ఆగిపోయాన్నారు. చాలా పనులకు నిధులు రాక పూర్తికావడం లేదని, సిద్దిపేట ప్రజల కోసం అభివృద్ధి పనులు జరిగే వరకు పోరాటం చేస్తానని హరీశ్‌రావు తెలిపారు. చిన్నకోడూరు మండలంలో పదేండ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. డ్రగ్స్, ఆన్లైన్ గేమ్స్‌కు యువత దూరంగా ఉండాలని, భవిష్యత్ అంతా యువతదే అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు నిమ్మ రజనీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.