సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 13: “జీవితంలో మొదటి అడుగు పడటం అనేది చాలా ముఖ్యమని, కృషి నాస్తి దుర్భిక్షం అంటారని, పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. జాబ్ మేళాతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. పాత రోజుల్లో ఉద్యోగం పురుష లక్షణం అనేవారని కానీ ఇప్పుడు ఉద్యోగం మానవ లక్షణం అయ్యిందన్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిలే అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే బాగుంటుందని అనుకుంటారని, అలా అనుకోవడంలో తప్పు లేదని కానీ, 25 ఏండ్ల ప్రజాజీవితంలోని అనుభవంతో చెబుతున్నానని జీవితంలో మొదటి అడుగు చాలా ముఖ్యమన్నారు. సిద్దిపేట దాటి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తేనే మీకు అనుభవం వస్తుందన్నారు. ఉద్యోగం కోసం ఊరు దాటి వెళ్తే మీకు ప్రపంచం అర్థమవుతుందని, కష్టం, డబ్బు విలువ తెలుస్తుందన్నారు. ఉన్నత ఉద్యోగానికి, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూనే ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు అని, గ్రూప్-1 పరీక్ష పెడితే నిరుద్యోగులు ఎంత ఆవేదన చేస్తున్నారో చూశారన్నారు. కొంత మంది మంత్రులు,అధికారులు లంచం అడిగారని చెబుతున్నారన్నారు.
ఇంత నిర్లక్ష్యంగా పరీక్ష నిర్వహిస్తారా.. అని స్వయంగా హైకోర్టు ప్రభుత్వానికి మొట్టి కాయలు వేసిందన్నారు. నిజంగా తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, అవినీతికి పాల్పడ్డవారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. తప్పును సరిదిద్దకుండా మరో అప్పీల్‌కు పోతామని చెప్పడం మూర్ఖత్వమన్నారు. ఎన్నికల ముందు ఏడాదికి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారని, కానీ రెండేండ్లు పూర్తయినా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అశోక్‌నగర్ చౌరస్తాలో రాహుల్‌గాంధీని కూర్చోబెట్టి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మాట ఏమైందన్నారు.
గతంలో కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్ష నిర్వహించి, ఇంటర్వ్యూలు నిర్వహిస్తే.. రేవంత్‌రెడ్డి మాత్రం కేవలం ఉద్యోగ పత్రాలు ఇచ్చి తామే ఇచ్చినట్లు చెప్పుకొంటున్నారన్నారు. అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తే చర్చ పెట్టకుండా జాబ్ క్యాలెండర్ అని చెప్పి పారిపోయారని, అది జాబ్ క్యాలెండర్ కాదని జాబ్ లెస్ క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు. ప్రియాంకాగాంధీతో హుస్నాబాద్ సభలో నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఇస్తామని చెప్పించారని గుర్తు చేశారు.
నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసి అసెంబ్లీలో ప్రశ్నిస్తామని, మీకు న్యాయం జరిగే వరకు కృషి చేస్తామన్నారు. సిద్దిపేటలో ఐటీ టవర్ ఏర్పాటు చేసి సుమారు ఒక వెయ్యి మందికి ఉద్యోగం కల్పించాలని చూశామని, కానీ ఈ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. సిద్దిపేటలో వెటర్నరీ కళాశాల పెడితే.. రేవంత్‌రెడ్డి దాన్ని కొడంగల్‌కు తరలించి సిద్దిపేటకు అన్యాయం చేశాడన్నారు.
సిద్దిపేటలో వెయ్యి పడకల దవాఖాన కట్టించి 95 శాతం పనిని పూర్తిచేయగా మిగిలిన చిన్న పనిని కూడా చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ప్రభుత్వం పాజిటివ్ డైరెక్షన్ కంటే, నెగిటివ్ డైరెక్షన్లోనే ఎక్కువ వెళ్తుందన్నారు. ఇటీవల లండన్‌కు వెళ్లినప్పుడు సిద్దిపేట ఐటీ టవర్‌లో కంపెనీలు ఏర్పాటు చేయాలని అక్కడ ఉన్న తెలంగాణ బిడ్డలను కోరడం జరిగిందన్నారు. దాదాపు 30 కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇక్కడికి వచ్చాయని తెలిపారు.
అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా సిద్దిపేట ప్రజల బాగు కోసం నిరంతరం తపించే వ్యక్తి హరీశ్‌రావు అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. చాలా బాధ్యతాయుతమైన వైఖరి కలిగిన వ్యక్తి హరీశ్‌రావు అన్నారు. సమయపాలన, నిబద్ధత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి హరీశ్‌రావు అన్నారు. ఆత్మవిశ్వాసం ఉండి నిరంతరం ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చన్నారు. నిరాశను దరిచేరనివ్వకుండా ఉండాలని, రోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ రంగంలో 1,60,000 ఉద్యోగాలు వేశారని, కానీ దుష్ప్రచారం ఎక్కువ జరిగిందన్నారు. 50 వేల ఉద్యోగాలు ప్రాసెస్‌లో ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ప్రైవేట్, ప్రభుత్వ రంగా ల్లో కలిసి సుమారు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఫరూ ఖ్ హుస్సేన్, మాజీ ఏఎంసీ చైర్మన్ పాల సాయిరామ్, సుడా మాజీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణశర్మ, వేణుగోపాల్‌రెడ్డి, పలు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.