దుబ్బాక,ఫిబ్రవరి 9 : దుబ్బాకపై మనబిడ్డ కేసీఆర్‌కు ప్రేమ ఉంటుందని.. రేవంత్‌రెడ్డికో,బీజేపీ కిషన్రెడ్డికో ఉం టుందా అని హరీశ్‌రావు అన్నారు. సోమవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని దుంపలపల్లి, చెల్లాపూర్, దుబ్బాక, లచ్చపేట వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హరీశ్‌రావుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆనంతరం దుబ్బాక ప్రజలనుద్దేశించి హరీశ్‌రావు మాట్లాడుతూ.. దుబ్బాకపై అభిమానంతోనే ఇక్కడ కేసీఆర్ బడి, గుడి , వంద పడకల దవాఖాన, డబుల్ బెడ్రూం ఇండ్లు, మినీ ట్యాంక్‌బండ్, ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు.

దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కృషితో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేస్తే, ప్రస్తుత ఎమ్మెల్యే కొత్త ప్రభాకరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ రెండున్నరేండ్లలో దుబ్బాకలో ఏ ఒక్క అభివృద్ధి పని చేసిందా అని ప్రశ్నించారు.రేవంత్‌రెడ్డికి బూతులు తప్ప అభివృద్ధిపైన సోయి లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ రెక్కలు ఊడిన పార్టీ అని , ఆ నాయకుల గురించి మాట్లాడితే సమయం వృథా అన్నారు. ఈ ఎన్నికల్లో దుబ్బాకలో 20 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి, గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు. మళ్లీ వచ్చేది మన కేసీఆర్ సర్కారేనని, మంత్రిగా తానే ఉంటూ దుబ్బాక అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారిస్తానని హరీశ్‌రావు హామీ ఇచ్చారు.

కాంగ్రెస్,బీజేపీలు ఇచ్చే డబ్బులు తీసుకుని, ఓటు మాత్రం కారుకే వేయాలని ప్రజలకు సూచించారు. ఈ మున్సిపల్ ఎన్నికలు దుబ్బాక ప్రజల భవిష్యత్‌కు సంబంధించినవని, పని చేసే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు గెలిపించుకోవాలని ప్రజలకు హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతంలో మల్లన్నసాగర్ రిజర్వాయర్ కేసీఆర్ కట్టించారని గుర్తుచేశారు. సాగు,తాగునీటి వెతలు తీర్చారన్నారు. మోసపూరిత హామీలిచ్చే కాంగ్రెస్,బీజేపీలకు చరమగీతం పాడాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మనోహర్‌రావు, ఎల్లారెడ్డి, రవీందర్‌రెడ్డి,కిషన్‌రెడ్డి, వెంకటనర్సింహ్మారెడ్డి, రాజమౌళి, భూమేశ్ , రాం రెడ్డి, శ్రీనివాస్, బీఆర్ఎస్ మున్సిపల్ అభ్యర్థులు , తదితరులు పాల్గొన్నారు.