సిద్దిపేట, ఫిబ్రవరి 1: రైతు భరోసా 26 జనవరి రాత్రి టికు టికుమని రైతుల ఖాతాల్లో పడుతుందన్నాడు సీఎం… టికు టికు లేదు.. టంగుటంగు లేదు.. మాటలకు చేతలకు పొంతన లేని కాంగ్రెస్ ప్రభుత్వంపై విసుగు వచ్చిందంటూ రైతులు ఎమ్మెల్యే హరీశ్‌రావుకు విన్నవించారు. శనివారం సిద్దిపేట రూరల్ మండలం బండచర్లపల్లి వద్ద రైతులు ఎమ్మెల్యే హరీశ్‌రావుతో ముచ్చటించారు. రూ.2 లక్షల పంట రుణమాఫీ చేస్తానని చెప్పి రూ.లక్ష కూడా సరిగ్గా చేయలేదన్నారు. వానకాలం రైతుబంధు ఎగ్గొట్టారని, యాసంగి పంటకు డౌటే ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా టైమ్‌కు అందరికీ రైతుబంధు వస్తుండే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక ఇప్పుడు ఎవరికీ వేస్త్తలేరు, కొత్తగా ఆత్మీయ భరోసా అంటుండ్రు, ఏది వచ్చేటట్టు లేదు.. ఏమి ఇచ్చేటట్టు లేడు… మల్ల ఎలక్షన్ కోడ్ వస్తుంది, సర్పంచ్ ఎలక్షన్ల కోసమే ఇస్తా ఇస్తా అంటుండు… ఇస్తానని చెప్పడం తప్ప ఇచ్చుడు లేదని హరీశ్‌రావు ముందు రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. రైతుల సమస్యలు విన ఎమ్మెల్యే హరీశ్‌రావు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని, రైతుల హకుల కోసం పోరాడుతానని హామీ ఇచ్చారు.