నర్సాపూర్,ఆగస్ట్7 : రెండేండ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను కష్టాల పాలు చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. గురువారం నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి, కొత్తప్రభాకర్ రెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతుల, విద్యార్థుల, నిరుద్యోగులను కష్టాల పాలు చేసిందని అలాగే అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు తప్ప ఏమి చేయలేదని మండిపడ్డారు. నాడు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 24 గంటల ఉచిత విధ్యుత్ అందించాడని, హామీ ఇవ్వకున్న కళ్యాణలక్ష్మి అందించాడ గుర్తు చేశారు.
200 పెన్షన్‌ను రూ.1000 చేశాడని, సీలింగ్ ఎత్తేసి నాలుగు కిలోల బియ్యాన్ని ఆరు కిలోలకు పెంచాడని, చెరువులను పునరుద్ధరించాడని, పెండింగ్ ప్రాజెక్ట్‌లను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి లక్షలాది ఎకరాలకు నీరు అందించాడన్నారు. అనేక చెక్‌డ్యామ్‌లు నిర్మించాడని అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఏమి చేసిందని ప్రశ్నించారు. పంట కాలువలు తవ్వడానికి ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన కాంగ్రెస్ ప్రభుత్వం పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల పేరిట కాలయాపన, అక్రమ కేసులు, మీడియాలో లీకులతో కాలం వెల్లబుచ్చారని మండిపడ్డారు.
గురువుకు గురుదక్షణ చెల్లించడానికే తండ్లాట
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హల్దీ వాగుపై 8 చెక్‌డ్యామ్‌లు, మంజీరాపై 8 చెక్‌డ్యామ్‌లు కట్టినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ దండగా అని అంటున్నాడని..హల్దీ, మంజీరా పరివాహక ప్రాంత మండలాల రైతులను అడుగుతే కాళేశ్వరంతో ఎంత మేలు జరిగిందో చెప్తారని అన్నారు.
గురువు గారికి గురుదక్షణ చెల్లించడానికి బనకచర్లకు గోదావరి నీళ్లను జారగోడుతున్నాడని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఫ్లై ఓవర్లకు రేవంత్‌రెడ్డి రిబ్బన్ కట్టింగులు చేస్తున్నాడే తప్ప, కొత్తగా చేసింది ఏమి లేదని ఎద్దేవా చేశారు.
మధ్యాహ్న భోజన కార్మికులు హైదరాబాద్‌లో 9 నెలల బిల్లులు రాక ధర్నా చేస్తే వారిని అక్రమంగా అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. ఊరికే కేసీఆర్‌ని తిట్టడం తప్ప నువ్వు ఏం పనిచేస్తున్నావని మీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిట్టడం జరిగిందని ఇకనైన బుద్ది తెచ్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఓ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ఈ కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ బోర్డ్ మాజీ చైర్మన్ దేవెందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, జడ్పీ కో-ఆప్షన్ మాజీ మెంబర్ మన్సూర్, మాజీ ఎంపీపీ వెంకటనర్సింగరావు, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.