పటాన్చెరు రూరల్, ఫిబ్రవరి 6: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం మహిళలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. పూరి జగన్నాథస్వామి మందిరంలో మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల ఇన్చార్జి గడీల శ్రీకాంత్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకుడు గూడెం మధుసూదన్‌రెడ్డితో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ నిర్వాహకులు, పూజారులు హరీశ్‌రావుకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన హరీశ్‌రావు మాట్లాడుతూ పదేండ్ల కేసీఆర్ పాలన, రెండేండ్ల కాంగ్రెస్ పాలనను చూస్తున్నారన్నారు.
రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి అధికారం ఇస్తే ఇప్పుడు రాష్ట్రం అంధకారంలో ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో వెల వెలబోతున్న పారిశ్రామికవాడల్లో కాంతులు నింపిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌దేనని గుర్తు చేశారు. రాష్ట్రంలోని పరిశ్రమలకు నాణ్యమైన కరెంట్ ఇచ్చి పారిశ్రామికప్రగతికి పట్టం కట్టామన్నారు. నాడు బీఆర్ఎస్ పాలనలో మండు వేసవిలోనూ కార్మికులకు ఓటీలు లభించేవన్నారు. ఇప్పుడు విద్యుత్ కోతలు మొదలై కార్మికుల ఉపాధి ప్రశ్నార్థకమవుతుందన్నారు. కరోనాకాలంలో వారి సొంత రాష్ర్టాలకు నడిచి వెళ్తున్న కార్మికులకు స్పెషల్ రైలులో ఉచితంగా పంపించామని గుర్తు చేశారు. పాశమైలారం నుంచి కర్ధనూర్ వరకు నాలుగులైన్ల ప్రత్యేక బీటీ రోడ్డు వేశామన్నారు.
సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి 54మంది చనిపోయిన ఘటనలో రేవంత్ బాధితులకు రూ. కోటి ఇస్తామని చెప్పి రూపాయి ఇవ్వలేదని హరీశ్‌రావు విమర్శించారు. ఘటనా స్థలానికి ఆదర్శ్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, స్థానిక బీఆర్ఎస్ శ్రేణులతో వెళ్లి సర్కార్ తీరుపై బాధితుల తరపున నిలదీశామన్నారు. సీఎం మరణించిన కుటుంబాలకు రూ. కోటి కంపెనీతో కలిసి చెల్లిస్తామని చెప్పినా సిగాచి పరిశ్రమ నేటికీ రూ. 25లక్షలే చెల్లించిందన్నారు.
రూ. 200 ఉన్న పింఛన్ రూ. 2వేలు చేసిన ఘనత బీఆర్ఎస్దేనన్నారు. కేసీఆర్ ఆడబిడ్డ పుడితే రూ. 13వేలు ఇచ్చారని, కేసీఆర్ కిట్ ఇచ్చి, తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటివద్దకు దింపేవారమని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకులు సోమిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, గడీల కుమార్‌గౌడ్, విజయ్‌కుమార్, మాజీ సర్పంచ్‌లు వెంకట్‌రెడ్డి, ఎల్లకొండ మల్లారెడ్డి, మోటే కృష్ణయాదవ్, రాములుయాదవ్, ప్రవీణ్‌రెడ్డి, అదాల యాదగిరి, మెరాజ్‌ఖాన్, రామకృష్ణముదిరాజ్, దేవానంద్, రాములుగౌడ్, విజయలక్ష్మి, మమత, దివ్య, సాయి, ప్రశాంత్, చందు, శ్రావణ్, సాయి పాల్గొన్నారు.