సిద్దిపేట, డిసెంబర్ 25 : కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు విద్యను గాలికి వదిలేసిందని, సంక్షేమ హాస్టళ్లలో సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. రాష్ర్టానికి విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లోని అనాథ పిల్లలకు అన్నం పెట్టి.. కాస్మోటిక్ చార్జీలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారని తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
సిద్దిపేటలోని నాసర్‌పురా పిల్టర్బెడ్ వద్ద గల అర్బన్ రెసిడెన్షియల్ సూల్లో గురువారం విద్యార్థులకు దుప్పట్లు ఆయన పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు పెట్టే గుడ్లు, బియ్యం, సరుకులు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం నాణ్యమైన సన్నబియ్యం హాస్టళకు సరఫరా చేసి, నాణ్యమైన భోజనం విద్యార్థులకు పెట్టిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం బియ్యం నూకలతో వస్తున్నాయని, ఆ బియ్యం తో అన్నం వండితే మెత్తగా ముద్దలుగా అవుతున్నదన్నారు.
విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు మోస్తున్న రేవంత్‌రెడ్డికి బూతులు మాట్లాడటం తప్ప ప్రజా సంక్షేమం పట్టదన్నారు. విద్యార్థులకు అన్నం పెట్టలేని స్థితిలో ఉన్న రేవంత్‌రెడ్డికి ఎలాంటి శిక్ష విధించినా తక్కువే అన్నారు. హాస్టల్ విద్యార్థులు చలి వణుకుతున్నారని, వారికోసం దుప్పట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఐదునెలల నుంచి విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలు, మెస్ బిల్లులు రావడం లేదన్నారు. రియల్ ఎస్టేట్ దందా చేయడం, కమీషన్లు పొందడం తప్ప సీఎం రేవంత్‌కు ప్రజల కోసం మంచి చేయాలనే ఆలోచన లేదని హరీశ్‌రావు విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కనకరాజు, నాయకులు పాల సా యిరాం, వజీర్, మొయిజ్, గుండు భూపేశ్, కాముని నగేశ్, నిమ్మ రజినీకాంత్‌రెడ్డి, జడేజా, రాజు, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.