సిద్దిపేట, జనవరి 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే నయముండే సార్, అప్పుడు పింఛన్లు, రైతుబంధు, అన్ని పథకాలు సక్కగ అమలైనయి సార్, కాంగ్రెస్ సర్కారు అచ్చిన నుంచి మాకు అంతా అన్యాయం జరుగుతున్నది సార్ అని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎదుట గాడిచర్లపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లాకేంద్రంలోని 15వ వార్డు గాడిచర్లపల్లిలో నిర్వహించిన ప్రజాపాలన సభలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి వారి సమస్యలను ఆయన విన్నారు.
అందరికీ రుణమాఫీ చేయలేదని, రైతుభరోసా రావడం లేదని, అర్హులకు రేషన్ కార్డులు రావడం లేదని, ఇందిరమ్మ ఇండ్లు రావడం లేదని, ఇప్పటికే చాలాసార్లు దరఖాస్తు పెట్టుకున్నా మళ్లీ పెట్టుమంటున్నారని ప్రజలు హరీశ్‌రావుకు గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. దరఖాస్తుల పేరుతో ప్రజల ఉసురు ఎందుకు పోసుకుంటున్నదని ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఒక్క హామీ అమలు కావడం లేదని, రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని విమర్శించారు. రైతుబంధు వేయాలని డిమాండ్ చేశారు.పంట రుణమాఫీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కోతలు, ఎగవేతలు, అసమర్ధ పాలన తప్ప రేవంత్‌రెడ్డి చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రజాపాలనలో రుణమాఫీ కాలేదని గాడిచెర్లపల్లిలోనే అనేక మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారని, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతాలేడు కాని.. ఢిల్లీకి పోయి హామీలను ఇస్తున్నాడు రేవంత్‌రెడ్డి. తెలంగాణ ఇచ్చుడు చేతకాదు కాని ఢిల్లీకి వెళ్లీ హామీలను ఇస్తున్నాడు. కాంగ్రెస్ ఇస్తానన్న రైతుభరోసా, రుణమాఫీ, రేషన్‌కార్డులు ఏవి. సీఎం దసరాకు రుణమాఫీ అన్నడు. అది కాలేదు. ఏడాది పాలనలో కాంగ్రెసోళ్లు ప్రజలను ఆగంజేసిండ్రు. నాకు రూ.42 వేల రుణమాఫీ కాలేదు. సీఎం ఏమో అందరికీ రూ. రెండు లక్షలు మాఫీ చేసినా అని చెప్పవట్టే. రైతుబంధు ఎగ్గొట్టిర్రు.
– గాడిచెర్లపల్లి సభలో రైతు నర్సింగరావు
ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టినం. కానీ, పేరు రాలేదు. అడిగినప్పుడల్లా దరఖాస్తు చేసుకోమంటున్నారు. ఇప్పుడు మళ్లీ దరఖాస్తులు చేయమంటే ఎట్లా. దరఖాస్తులకు పైసలు పెట్టుడు తప్ప లిస్ట్‌లో పేరు రావడం లేదు. మా సమయం ఖరాబు చేస్తున్నరు. దరఖాస్తులు పెట్టుడు ఉంది తప్ప పథకాలు మాత్రం రావడం లేదు.
– జహీరొద్ద్దీన్, 15వ వార్డు సిద్దిపేట
నాకు రుణమాఫీ కాలేదు. కానీ, ఉల్టా రూ.16 వేల మిత్తి కట్టిన. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జాబితాలో నాపేరు లేదు. మూడు విడుతలు చూసినా నాపేరు జాబితాలో రాలేదు. నాకు రూ.1.60 లక్షల పంట రుణం ఉంది. కానీ మాఫీ కాలేదు. కాంగ్రెస్ సర్కారు గిట్ల మమ్మల్ని మోసం చేయడం తగదు.
– ఉడుత బాలయ్య, రైతు, గాడిచెర్లపల్లి
నాకు ఇప్పటి వరకు ఒక్క విడుత కూడా రుణమాఫీ కాలేదు. అధికారులను అడిగితే మాకు తెలువదు అంటుండ్రు. నాకు రూ.1.34 లక్షల పంటరుణం ఉంది.మూడు విడుతలుగా నాపేరు రాలేదు. డిసెంబర్ నెలలో మిత్తి కట్టి రెన్యువల్ చేసుకున్న. అయినా నా లోన్ మాఫీ చేయలేదు. బ్యాంక్ అధికారులను అడిగితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవు అంటున్నారు. రైతుభరోసా ఇంకెప్పుడు ఇస్తారు. రెండు పంటల పైసలు వేయలేదు. రుణమాఫీ కాలేదు. కాంగ్రెస్ సర్కారు మమ్మల్ని దగా చేస్తున్నది.
-కొమ్ము యాదయ్య, రైతు, గాడిచెర్లపల్లి
సిద్దిపేటలోని గాడిచెర్లపల్లి 15వ వార్డులో బుధవారం ప్రజాపాలన సభ నిర్వహించారు. వార్డు ప్రజల నుంచి వార్డు కార్యాలయంలో అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో దరఖాస్తులు స్వీకరించడానికి అధికారులు ఇబ్బంది పడ్డారు. దరఖాస్తుదారులు సెల్ఫోన్లో టార్చ్ ఆన్‌చేయగా, ఆ వెలుతురులో అధికారులు దరఖాస్తులు స్వీకరించారు.
– సిద్దిపేట స్టాఫ్ ఫొటోగ్రాఫర్, జనవరి 22