హైదరాబాద్, జూన్12(నమస్తేతెలంగాణ): ఖమ్మం జిల్లాలో లైంగికదాడి యత్నానికి గురై, దుండగుడి దాడితో తీవ్ర గాయాలపాలై హైదరాబాద్ నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న బాలికను మంత్రులు సీతక్క, కొండాసురేఖ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్‌తోపాటు చికిత్స అందిస్తున్న వైద్యుల ద్వారా బాలిక ఆరోగ్య పరిస్థితిపై మంత్రులు వివరాలు తెలుసుకొని, ఆమెకు ధైర్యం చెప్పారు. బాలికకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని, వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నదని నిమ్స్ డైరెక్టర్ మంత్రులకు వివరించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితారామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా కూడా మంత్రులతో ఉన్నారు.
పరామర్శించి సీపీఐ నేతలు
ఖమ్మంలో జరిగిన అమానుష ఘటనలో గాయపడి హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాలిక, ఆమె తల్లిదండ్రులను శుక్రవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, శాసనమండలి సభ్యుడు నెల్లికంటి సత్యం పరామర్శించారు. ఈ సందర్భంగా బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని, అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.