నంగునూరు, మే 26 : కాంగ్రెస్ పాలనలో ఆరుగ్యారెంటీలు, హామీలు అటకెక్కాయని, ఏ ఒక్కవర్గం సంతోషంగా లేదని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. అందాల పోటీల నిర్వహణకు పైసలు ఉంటాయి కానీ, విత్తనాలు, చేప పిల్లలు ఇవ్వడానికి పైసలు లేవా అని.. ఏ వర్గం ప్రజల కడుపు నింపడానికి అందాల పోటీలు నిర్వహిస్తున్నారో సీఎం సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని పాలమాకుల గ్రామంలో పండుగ సాయన్న, కొరివి కృష్ణ స్వామి ముదిరాజ్ విగ్రహాలను శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్‌తో కలిసి హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. నంగునూరు మండలంలో మొట్ట మొదటి సారిగా పండుగ సాయన్న, కొరివి కృష్ణస్వామి విగ్రహాలు ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విగ్రహాలను ఆవిష్కరించడం ఎంత ముఖ్యమో, వారిని జీవితంలో ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లడం అంతే ముఖ్యమన్నారు. హైదరాబాద్ తొలి మేయర్‌గా, ముదిరాజ్ సమాజానికి కొరివి కృష్ణ స్వామి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. పండుగ సాయన్న తన ప్రాణాలను లెక్క చేయకుండా పేదల కోసం పోరాడారని, చివరికి ప్రాణాలను వదిలి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినట్లు తెలిపారు. కానిస్టేబుల్ కిష్టయ్య తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసి చరిత్ర పుటల్లో నిలిచిపోయారన్నారు. కిష్టయ్య కుటుంబాన్ని కేసీఆర్ ఆదుకున్నారని, ఆయన కూతురిని డాక్టర్ చదివించడమే కాకుండా ఇప్పుడు పీజీ చదివిస్తున్నట్లు తెలిపారు.
మిషన్ కాకతీయ ద్వారా ప్రాజెక్ట్టులను చెరువులకు అనుసంధానం చేసి, కొత్త ప్రాజెక్టులు నిర్మించి చెరువులో నీళ్లు నింపి ముదిరాజులకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయూత ఇచ్చినట్లు హరీశ్‌రావు తెలిపారు. కాలమైనా కాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో చెరువులను నింపి నిండుకుండలా చేశామని, దీంతో గ్రామాల్లో ముదిరాజులకు ఉపాధి దొరికిందన్నారు. సమైక్య రాష్ట్రంలో చెరువులను, ప్రాజెక్ట్‌లను పట్టించుకోలేదని, మన నీళ్లు మనకు దక్కనీయలేదన్నారు. కృష్ణా, గోదావరిలో మన నీళ్ల వాటా మనకు దక్కాలని పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తిచేసినట్లు తెలిపారు. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్ట్‌లను పూర్తి చేశామన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రూ.1000 కోట్లు ఖర్చు చేసి ముదిరాజులకు బండ్లు, ఆటోలు, పడవలు, వలల కోసం ఆర్థిక సాయం అందించినట్లు గుర్తుచేశారు. ఏటా రూ.120 కోట్లు ఖర్చు చేసి ఉచితంగా చేప పిల్లలు, రొయ్యల్ని చెరువుల్లో, ప్రాజెక్టుల్లో వదిలింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సగం జిల్లాల్లోని చెరువుల్లో ఇప్పటి వరకు చేప పిల్లలు పోయలేదన్నారు. జూన్ నెల వచ్చినా ఇప్పటికీ ప్రభుత్వం చేప పిల్లల టెండర్లు పిలవలేదని, దీన్ని బట్టి ముదిరాజులపై ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతున్నటుల హరీశ్‌రావు పేర్కొన్నారు. చెరువులో చేప పిల్లల్ని వదలకపోతే ప్రభుత్వాన్ని వదిలిపెట్టమన్నారు. ముదిరాజుల, మత్స్యకారుల ఉపాధి దెబ్బతీయకూడదని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. విత్తనాలు, చేప పిల్లలు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌లో రూ. 10 వేల కోట్లతో టెండర్లు పిలిచారని, జీహెచ్ఎంసీలో రూ.7 వేల కోట్లతో టెండర్లు పిలిచారని, హెచ్ఎండీఏలో రూ.20 కోట్లతో టెండర్లు పిలిచారని, ఫ్యూచర్ సిటీలో రేవంత్‌రెడ్డి భూములు కొన్నాడని, ఆరు లేన్ల రోడ్డు వేసుకోవడానికి రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు.
వీటన్నింటీకీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో సమాధానం చెప్పాలన్నారు. కమీషన్ల కోసం, జేబులు నింపుకోవడానికి, ఢిల్లీకి కప్పం కట్టడానికి రూ.లక్ష కోట్ల టెండర్లను కాంగ్రెస్ ప్రభుత్వం పిలుస్తున్నదని హరీశ్‌రావు ఆరోపించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో పెద్దమ్మ గుడి లేని ఊరే ఉండదని, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ లేని ఊరే లేదన్నారు. సిద్దిపేటలో రూ.10 కోట్లతో ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మించామన్నారు. పాలమాకులలో ముదిరాజులు, యువత ముందుకు వచ్చి పండుగ సాయన్న, కొరివి కృష్ణ స్వామి విగ్రహాలను ఏర్పాటు చేసినందుకు హరీశ్‌రావు అభినందనలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేకుంటే యుద్ధ్దానికి సిద్ధ్దమని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రముఖుల విగ్రహాలను పెట్టుకొని స్మరించుకుంటున్నట్లు తెలిపారు. కృష్ణ స్వామి విగ్రహాలను హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రంలో నలుమూలల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన చరిత్ర చాలా గొప్పదని, బలహీన వర్గాల కోసం గ్రంథాల్ని రచించారన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్‌కు మొదటి మేయర్‌గా కృష్ణస్వామి పనిచేశారని, ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారన్నారు.
పండుగ సాయన్న భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేశాడని, పెద్దోన్ని కొట్టు పేదలకు పెట్టాలనే నినాదంతో ఆయన పని చేశాడన్నారు. సాయన్న సమాజ శ్రేయస్సు కోసం పని చేశాడన్నారు. కేసీఆర్ సీఎం ఉన్నపుడే కేవల్ కిషన్ జాతరను అధికారికంగా ప్రకటించి నిధులు విడుదల చేసినట్లు గుర్తుచేశారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లు అయినా పేద ముదిరాజులకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. కేసీఆర్ చేయించిన సమగ్ర కుటుంబ సర్వే వల్ల ముదిరాజులు అధిక సంఖ్యలో ఉన్నామని తెలిసిందన్నారు. కేసీఆర్ హయాంలోనే మత్స్యకారులకు వాహనాలు పంపిణీ చేశారని తెలిపారు.