నర్సాపూర్/ వెల్దుర్తి, జూలై 17: రైతులకు 24 గంటల కరెంట్ వృథా అని, కేవలం మూడు గంటల కరెంట్ సరిపోతుందని, రైతులను రేవంత్‌రెడ్డి అవమానించాడని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే మదన్‌రెడ్డి ఆధ్వర్యంలో మాసాయిపేట్ మండలంలోని రైతు వేదికలో రైతులతో సమావేశం నిర్వహించి, మూడు పంటల ప్రభుత్వం కావాలని సదస్సులో తీర్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ 14 ఏండ్లు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనలో రైతులు సుఖసంతోషాలతో ఉన్నారని వెల్లడించారు. రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలిచాడన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు 24 గంటల విద్యుత్ వృథా అని, కేవలం మూడు గంటల విద్యుత్ సరిపోతుందని అనడం కాంగ్రెస్ పార్టీ దురుద్దేశం అర్థమవుతుందన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణ రైతాంగం 10 ఏండ్లు వెనక్కి వెళ్లారన్నారు. పనికిమాలిన మాటలు మాట్లాడినందుకు ప్రధాని మోదీ సైతం బండి సంజయ్‌ని పదవిలోంచి తీసివేశారని, రేవంత్‌రెడ్డి కూడా ఇదే తీరుగా మాట్లాడుతున్నాడని ఢిల్లీ పెద్దలకు కనువిప్పుకలగాలని హితవు పలికారు. రేవంత్‌రెడ్డి మాటల తీరు బీఆర్ఎస్కు ఎంతో ఉపయోగపడతాయని, 100 సీట్లు గెలవడం పక్కా అన్నారు. నాయకులు మాట్లాడితే అభివృద్ధి గురించి మాట్లాడాలని, రేవంత్‌రెడ్డి మాత్రం కేసీఆర్ కుటుంబసభ్యులను తిడుతూ పబ్బం గడుపుతున్నాడని విమర్శించారు. 24 గంటల ఉచిత విద్యుత్‌తో రైతాంగం సంతోషంగా ఉంటే లేనిపోని చిచ్చుపెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిని రైతులు తీవ్రంగా ఖండించి కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలని సూచించారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రైల్లో ప్రయాణించే పొరుగు రాష్ర్టాల ప్రజలు పచ్చదనం, నీళ్లు చూడగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని గుర్తుపట్టే స్థాయికి ఎదిగిందన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో నర్సాపూర్ నియోజకవర్గంలో 9 ఏండ్లల్లో 20 సబ్స్టేషన్లను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా రూ.56 కోట్లతో గిరిజన తండాల్లో సీసీ రోడ్లను నిర్మించామని, నియోజకవర్గ వ్యాప్తంగా 28 రైతుల వేదికలను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. లా ఆండ్ ఆర్డర్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాడని తెలిపారు.
గిరిజన రైతులకు పోడు భూముల సర్టిఫికెట్లను పంపిణీ చేశామని, అర్హులైన మిగతా వారికి కూడా సర్టిఫికెట్లను అందించాలని సీఎం కేసీఆర్‌ను కోరగా, సానుకూలంగా స్పందించారని తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గానికి కాళేశ్వరం నీళ్లు తప్పకుండా అందజేస్తామని, కరోనాతో పనులు ఆగిపోయాయని పిలుచుకొని మరీ చెప్పాడని వివరించారు. రైతులు ఐకమత్యంతో ఉండి కాంగ్రెస్, బీజేపీలను తరిమేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వరూపానరేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, నర్సాపూర్ ఆత్మకమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, సొసైటీ డైరెక్టర్ నర్సింహులు, బీఆర్ఎస్ నాయకులు నరేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, సిద్దిరాములుగౌడ్, నాగరాజు, శ్రీనునాయక్, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.
3 గంటల కరెంట్ తప్పుడు మాటలు..
18, 20 గంటల కరెంట్ ఇస్తేనే పంటపొలాలు పారడం లేదు. అలాంటి రెండు, మూడు గంటల కరెంట్ ఇస్తే ఎలా సరిపోతుంది. మూడు ఎకరాలకు మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్‌రెడ్డి మాటలు తప్పు. బోరుబావుల మీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న కరెంట్ మంచిగుంది. ఇప్పటిలాగానే ఎప్పటికీ కరెంట్ ఇవ్వాలి. సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఎన్నుకోవాలి.
– రేపల్లె అంజయ్య, రైతు మాసాయిపేట
తాగునీళ్లకే సరిపోదు మూడు గంటల కరెంట్
మూడు గంటల కరెంట్ తాగునీళ్లకు సరిపోదు. మూడు గంటల కరెంట్ ను వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు ఇస్తు న్న కరెంట్‌తో ఉన్న కాడికి భూము లు పండుతున్నాయి. 24 గంటల కరెంట్ తప్పకుండా కావాలి. ఉన్నకాడికి తెలంగాణ గవర్నమెంట్ మంచిగుంది. ఇచ్చే మూడు గంటల కరెంట్‌లో గంట పోతే పొలాలు ఎలా పారుతాయి. గంటకు ఎకరం పొలం ఎలా పారుతుంది. వచ్చేది, తెచ్చుకునేది సీఎం కేసీఆర్‌నే.
– ఏశం రాములు, రైతు మాసాయిపేట