పటాన్చెరు, మార్చి 7: కాంగ్రెస్‌ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తిట్టాడని షోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతుంది. దీంతో కాంగ్రెస్‌లో వేడి రాజుకుంది. ఇటీవల ప్యారానగర్ డంప్‌యార్డు వద్దంటూ జేఏసీ నాయకులు క్యాంప్ ఆఫీసులో పటాన్చెరు ఎమ్మెల్యేను కలిసి ప్యారానగర్ డంప్‌యార్డును నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఎమ్మె ల్యే నెల రోజుల తర్వాత గుర్తుకు వచ్చానా.? అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
అధిష్టానానికి మీరు చెబితే డంప్‌యార్డు ఆగుతుందని పలువురు చెప్పడంతో ఆగ్రహంతో ఎమ్మెల్యే కాంగ్రెస్‌పై అనుచిత పదజాలం వాడినట్లుగా ప్రచారం అవుతున్న ది. దూరం నుంచి తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే వీడియో వార్తను ఖండించారు. ఫ్యాబ్రికేటేడ్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. డంప్‌యార్డుపై ఏర్పడిన జేఏసీ నాయకులు తనను కలిసిన మాట వాస్తవం అన్నారు.
వారికి, గుమ్మడిదల ప్రజలకు సంపూర్ణ మద్ద తు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. నేను వారి ఎదుట కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ప్రచారం చేయడం పై ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే పేరున విడుదల చేసిన వార్త పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్‌లో కార్చిచ్చు రగిల్చింది. పార్టీలోని మరోవర్గం దానిని విస్త్రతంగా వైరల్ చేస్తున్నది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకుల వరకు ఈ విషయం వెళ్లినట్లు ప్రచారం అవుతున్నది. ఈ వివాదం మరింత రాజుకునేలా ఉంది.
అమీన్పూర్ మార్చి 7: కాంగ్రెస్‌లోనే ఉంటూ పార్టీపై ఎమ్మెల్యే గూడెం అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీని బ్రష్టు పట్టించాలనే దురాలోచన మానుకోవాలన్నారు. పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నష్టం చేకూర్చేలా వ్యవహరించడం సరైందికాదన్నారు. పార్టీలో ఉండడం ఇష్టం లేకపోతే స్వచ్ఛందంగా వచ్చినదారిలోనే వెళ్లాలని సూచించారు. కానీ, ఇదే పార్టీలో ఉంటూ అధికారాన్ని అనుభవిస్తూ పార్టీకి నష్టం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
పదేండ్లు కష్టనష్టాలు భరించి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేశామని, అలాంటిది ఓ పార్టీలో గెలిచి అధికారం అనుభవించేందుకు కాంగ్రెస్‌లో చేరి పార్టీని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్యారానగర్ డంప్ యార్డు సమస్య పరిష్కారం కోసం వచ్చిన జేఏసీ సభ్యులను కించపర్చడమే కాకుండా పార్టీని సైతం హేళనచేయడం అక్కడున్న వారందరూ స్వయంగా విన్నారని, అలాంటిది ఈ విషయం ఎవరో వక్రీకరించారని అబద్ధాలు మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశామన్నారు. సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి, చంద్రారెడ్డి, సుధాకర్ గౌడ్, శశిధర్ రెడ్డి, నర్సింగరావు, సుధాకర్ యాదవ్, వడ్డే కృష్ణ, జైపాల్ రెడ్డి, ప్రతాప్‌రెడ్డి తదితరులు ఉన్నారు.