రామచంద్రాపురం, జూలై 5: సంగారెడ్డి జిల్లా కొల్లూర్ లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్కు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం తెల్లాపూర్ డివిజన్లోని కొల్లూర్‌లో లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నలభై ఏండ్ల క్రితం కొల్లూర్‌లోని పలు సర్వేనంబర్లలో చేసిన లేఅవుట్లో సుమారుగా 1500మంది ప్లాట్లు కొనుగోలు చేశారని అన్నారు. ప్లాట్ ఓనర్స్‌ను పొజిషన్లోకి రానివ్వకుండా కొందరు వ్యక్తులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు.
తమ ప్లాట్లను దక్కించుకోవడం కోసం కొన్నేండ్లుగా ప్లాట్ల ఓనర్లు న్యాయ పోరాటం చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్తు అవసరాల కోసం రూపాయి రూపాయి కూడబెట్టి ప్లాట్లు కొంటే, నేటికి వారికి ప్లాట్లు దక్కకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీపురం ప్లాట్ ఓనర్లకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ప్లాట్ ఓనర్స్కు న్యాయం చేస్తామని నమ్మించి ఓ వ్యక్తి ఫోర్జరీ సంతకాలతో ప్లాట్లకు సంబంధించిన భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. వివాదంలో ఉన్న భూమిలో హెచ్ఎండీఏ నుంచి అనుమతులు తీసుకువచ్చి నిర్మాణాలు కొనసాగించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపైన సీఎంసీ కమిషనర్, సిటీ ప్లానర్, హెచ్ఎండీఏ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అనుమతిని రద్దు చేయించినట్లు తెలిపారు. ఎంతో కష్టపడి ప్లాట్లు కొంటే, కొందరు భూ ఆక్రమణదారులు ఇలాంటి చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని విమర్శించారు.
ఈ ఆక్రమణల్లో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రతి ప్లాట్ యజమానికి పూర్తి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దీనికోసం సమిష్టిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం కొల్లూర్‌లోని పెద్ద కాల్వను ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పరిశీలించారు. త్వరలోనే కాల్వ పునరుద్ధరణ పనులు చేపడుతామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వెంకట్రాంరెడ్డి, నర్సింహ, యాదయ్య, మధు, లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.