పటాన్చెరు టౌన్, జూలై 6: సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై ఓటర్లకు అవగాన కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆరోపించారు. సర్‌పై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్, బీఆర్ఎస్ డిజిటల్ మెంబర్‌షిప్‌పై ఈనెల 12న పటాన్చెరు పట్టణలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై అందరికీ అవగాహన కల్పిస్తారని తెలిపారు.
సోమవారం ఉదయం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో నివాసం ఉంటున్న దేశంలోని 28 రాష్ర్టాల ప్రజల ఓటు హక్కు అంశం ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నియమించిన బూత్ లెవల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఆశించిన మేర పనిచేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నియమించిన బూత్ లెవల్ ఏజెంట్లు నిరంతరం అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటరుకు ఎస్ఐఆర్పై అవగాహన కల్పించి వివరాలు నమోదు చేయించాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతో బీఆర్ఎస్ ఓట్లను తొలిగించేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నియోజవకవర్గంలో 70వేల ఓట్లు తొలిగించి ఆమెను ఓడించారన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని తొమ్మిది డివిజన్లలో అత్యధిక ఓట్లు ఉన్నాయని, రాబోయే బల్దియా ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయాలంటే ప్రతి ఓటును రక్షించుకోవాల్సిన అవసరం కార్యకర్తలపై ఉందన్నారు. రెండుచోట్ల ఓటు హక్కు కలిగిన ఓటర్లకు స్థానికంగానే ఓటు ఉంచుకునేలా సూచించాలని కోరారు. బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు సఫాన్దేవ్, శంకర్‌యాదవ్, కుమార్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు వెంకటేశంగౌడ్, మున్సిపల్ చైర్మన్లు జనార్దన్, ప్రమీల, కుమార్‌గౌడ్, మా జీ ఎంపీపీలు దేవానంద్, యాదగిరి, మాజీ జడ్పీటీసీలు బాల్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్, నాయకులు సోమిరెడ్డి, భిక్షపతి, రాములు గౌడ్, రాజ్‌కుమార్, హనుమంత్‌రెడ్డి, పాండు, మేరాజ్‌ఖాన్, రాజేశ్, శ్రీనివాస్ యాదవ్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.