చేర్యాల, మార్చి 2 : సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు,ధూళిమిట్ట మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటాయి. నెల రోజులుగా చేర్యాల ప్రాంతంలో నిత్యం పదుల సంఖ్యలో బోరుబావులు రైతులు తవ్విస్తున్నారు. నెల రోజుల్లో ఈ ప్రాంతంలో సుమారు 600 బోర్లు రైతుల తవ్వించారు.
అందులో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే బోర్లలో నీరువచ్చాయి. నీళ్లు లేక యాసంగిలో వేసిన వరి పంట ఎండిపోతున్నది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి ఆయా గ్రామాల్లోని చెరువులు నింపడంతో బోరుబావుల్లో భూగర్భ జల మట్టం పెరిగి పంటలు విస్తారంగా పండాయి. ప్రస్తుతం బోరుబావుల నుంచి నీరు అంతంతమాత్రంగానే వస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు ఎండిపోతే తమకు అప్పులే దిక్కవుతాయని రైతులు వాపోతున్నారు.