జహీరాబాద్, సెప్టెంబర్ 29 : కొండ కోనలు, గుట్టల మధ్య నుంచి గలగలా పారుతూ పరవళ్లు తొక్కుతూ జలాలు కర్ణాటక వైపు వృథాగా తరలిపోతుండడంతో సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి రైతులు నిరాశకు లోనవుతున్నారు. మొగుడంపల్లి మండలం జాడిమల్కాపూర్ గ్రామ శివారులోని తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతం గుండా ప్రవహించే పెద్దవాగు నుంచి జలాలు వృథాగా కర్ణాటకకు కండ్ల ముందు తరలిపోతున్నా ఏం చేయలేని పరిస్థితి మొగుడంపల్లి మండల రైతులది. ఈ ఎత్తిపోతల జలపాతం గుండా పారుతున్న నీటిని మొగుడంపల్లి మండల సాగునీటి అవసరాలకు వినియోగించుకోవచ్చు.
ఈ పెద్దవాగుపై ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తే న్యాల్కల్ మండలంలో 2వేల ఎకరాలకు పైగా సాగునీరు ఇవ్వడంతో పాటు భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. కానీ, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ దిశగా కృషిచేయడం లేదు. పెద్దవాగు గుండా ప్రవహిస్తున్న జలాలు కర్ణాటకలోని చండ్రంపల్లి ప్రాజెక్టుకు చేరుతున్నాయి. వేసవిలోనూ ఈ వాగు ప్రవహిస్తూ చండ్రంపల్లి ప్రాజెక్టును జీవనదిగా మార్చింది. ఎత్తిపోతలే నిర్మించాల్సిన జాడిమల్కాపూర్ జలపాతం సందర్శనకు సెలవు రోజుల్లో భారీగా పర్యాటకులు తరలివస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ మండలంలోని గొటిగార్‌పల్లి గ్రామ శివారులో పెద్దవాగు ప్రాజెక్టు వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు నిండుతుంది. దీంతో ఈ ప్రాజెక్టు నుంచి దిగువకు వెళ్తున్న వరద జహీరాబాద్, మొగుడంపల్లి మండలంలోని మల్చల్ల, జాడిమల్కాపూర్, సజ్జరావుపేట తదితర గ్రామాల మీదుగా కర్ణాటకకు తరలిపోతున్నది.
కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాలోని చించోళి తాలూకా పరిధిలోని బీమా నది తీరంలో 1973లో చండ్రంపల్లి ప్రాజెక్టును నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు పెద్దవాగు గుండా ప్రవహిస్తూ వృథాగా వెళ్లే జాడిమల్కాపూర్ జలపాతం జలాలే ప్రధాన ఆధారం. ఈ ప్రాజెక్టు ద్వారా కర్ణాటక ప్రాంతానికి సాగు, తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. కానీ, వృథాగా పోతున్న ఈ నీటిని సద్వినియోగం చేసుకునే దిశలో సంగారెడ్డి జిల్లా యంత్రాంగం కృషిచేయడం లేదు.
పెద్దవాగు ప్రాజెక్టు నిర్మాణానికి అనుకూలంగా ఉన్నా, పాలకులు శ్రద్ధ్ద చూపడం లేదు. పెద్దవాగు ఇరువైపులా కొండలు ఉండడంతో ప్రాజెక్టు నిర్మించి, ఎత్తిపోతల ద్వారా పొలాలకు సాగునీటిని అందివచ్చని రైతులు చెబుతున్నారు. ఎత్తిపోతల పథకం నిర్మిస్తే మొగుడంపల్లి మండలంలోని జాడిమల్కాపూర్, సజ్జారావుపేట తదితర గ్రామాలకు చెందిన దాదాపు 2వేల ఎకరాలకు నీరందించవచ్చు. దశాబ్దం క్రితం పెద్దవాగుపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి అప్పట్లో సంబంధింత అధికారులు ప్రభుత్వానికి నివేదికలను పంపించారు. కానీ, నిధులు మంజూరు కాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రాజెక్టు నిర్మించాలని రైతులు కోరుతున్నారు.
జాడిమల్కాపూర్ ఎత్తిపోతల జలపాతం ప్రాంతాన్ని ప్రభుత్వం పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. వర్షాకాలంతో పాటు వారంతపు సెలవులు దొరికినప్పుడు ఎత్తిపోతల జలపాతాన్ని చూసేందుకు తెలంగాణ, కర్ణాటక నుంచి పర్యాటకులు వస్తున్నారు. ఆటవీ ప్రాంతంలో కొండ కోనలు, గుట్టల మధ్య నుంచి జలపాత సోయగాలు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇక్కడ కనీస సౌకర్యాలు లేక సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు సరిగ్గా లేక రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభు త్వం హోటళ్లు, వసతి గృహాలు నిర్మించి, రోడ్డును బాగుచేసి పర్యాటక అభివృద్ధికి కృషిచేయాలి.
పెద్దవాగు గుండా ప్రవహిస్తూ కర్ణాటకకు తరలిపోతున్న జలాలను సద్వినియోగం చేసుకునేలా మన ప్రభుత్వం దృష్టిసారించాలి. కర్ణాటకకు వృథాగా పోతున్న జలాలను వినియోగించుకోవడానికి వీలుగా పెద్దవాగుపై ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించాలి. ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తే సుమారు 2వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. అంతేకాకుండా పర్యాటకంగా అభివృద్ధి చేయవచ్చు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి కృషిచేయాలి.
-గిర్మాగారి పరశురామ్, ఆత్మకమిటీ మాజీ డైరెక్టర్, జాడిమల్కాపూర్
పుల్కల్,సెప్టెంబర్ 29 : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు వదర తగ్గడంతో ఆదివారం ఉదయం 10.30 గంటలకు అన్ని గేట్లను అధికారులు మూసి వేశారు. 6,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. 2784 క్యూసెక్కుల నీరు దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తిసామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, 29.678 టీఎంసీల నీరు నిల్వ ఉంది.గొర్రెల కాపరులు,మత్స్యకారులు నది పరీవాహక ప్రాంతాలకు వెళ్లకూడదని నీటి పారుదల శాఖ అధికారులు హెచ్చరించారు.