సంగారెడ్డి డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. సంగారెడ్డి జిల్లాలోని 136 సర్పంచ్ స్థానాలకు 578 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1246 వార్డు స్థానాలకు 3222 మంది బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 3వ తేదీ వరకు సమయం ఉండటంతో బరిలో నిలిచిన అభ్యర్థులు విత్‌డ్రాలపై దృష్టి పెట్టారు. మండల కేంద్రాలు, పెద్ద పంచాయతీల్లోని బలమైన అభ్యర్థులు ప్రత్యర్థులను బరి నుంచి తప్పించి ఏకగ్రీవ సర్పంచ్‌లుగా ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతున్నారు.
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు ముందే సర్పంచ్ పదవులు ఏకగ్రీవం చేసుకునేందుకు అభ్యర్థులు పావులు కదుపుతున్నారు. తొలి విడత ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో ఓట్ల సందడి కనిపిస్తుంది. ప్రధాన పార్టీలు మద్దతు ఇస్తున్న సర్పంచ్ అభ్యర్థులు ఎలాగైనా ఎన్నికల్లో గెలువాలని పట్టుదలతో ఉన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సంగారెడ్డి, కంది, సదాశివపేట, కొండాపూర్ మండలాలతోపాటు పటాన్చెరు, గుమ్మడిదల, హత్నూర మండలాల్లోని 136 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 578 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తొలి విడత ఎన్నికలు జరుగుతున్న మండలాల్లో రియల్ ఎస్టేట్ ప్రభావం అధికంగా కనబడుతున్నది.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించిన నాయకులు ప్రధాన పార్టీల మద్దతుతో సర్పంచ్ బరిలో నిలిచారు. ముఖ్యంగా ముంబయి జాతీయ రహదారి పక్కన ఉన్న పంచాయతీలు, మండల కేంద్రాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ఎలాగైనా సర్పంచ్ పదవులు దక్కించుకోవాలని పట్టుదలగా ఉన్నారు. దీంతో ఈనెల 3వ తేదీలోగా నామినేషన్లు విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. సర్పంచ్ అభ్యర్థులు ప్రత్యర్థులతో బేరసారాలు, బుజ్జింగింపులు చేస్తున్నారు. ప్రత్యర్థి అభ్యర్థులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్పి బరి నుంచి తప్పుకునేలా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
డబ్బులకు లొంగకపోతే తమకున్న రాజకీయపలుకుబడితో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల ద్వారా ప్రత్యర్థులకు ఫోన్లు చేయించి పోటీ నుంచి తప్పుకునేలా ఒత్తిడి తీసుకువస్తున్నారు. గ్రామంలోని కుల సంఘాల పెద్దలతో సమావేశాలు,ప్రత్యర్థులతో భేటీలు ఏర్పాటుచేయడంతోపాటు విందులు ఇస్తున్నారు. బలమైన సర్పంచ్ అభ్యర్థులు ప్రయత్నాలు ఫలించిన చోట ఏకగ్రీవాలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మండల కేంద్రాలు, జాతీయ రహదారి పక్కన ఉన్న గ్రామాల్లో పోటీ నుంచి తప్పుకునేందుకు చాలా మంది ఆసక్తిచూపడంలేదు. కాంగ్రెస్ మద్దతు తమకే ఉందంటూ ఇద్దరు, ముగ్గురు నాయకులు సర్పంచ్ బరిలో దిగారు. దీంతో సొంత పార్టీ నేతలను బరి నుంచి ఎలా తప్పించాలో తెలియక కాంగ్రెస్ అభ్యర్థులు సతమతం అవుతున్నారు.
తొలి విడత ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో చాలా చోట్ల ఉపసర్పంచ్ పదవి దక్కించుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఉపసర్పంచ్‌లకు సైతం చెక్ పవర్ ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. సర్పంచ్ పదవి మహిళలకు రిజర్వు అయిన చోట ఉపసర్పంచ్ పదవి దక్కించుకునేందుకు చాలామంది పోటీ పడుతున్నారు. ఉపసర్పంచ్ పదవి దక్కించుకోవటం ద్వారా గ్రామంలో పెత్తనం చెలాయించడంతోపాటు చెక్‌పవర్‌ను అనుకూలంగా వాడుకోవచ్చని అనుకుంటున్నారు. సర్పంచ్ పదవికి పోటీ చేసే అవకాశం దక్కని నాయకులు ఉపసర్పంచ్ పదవి కోసం పావులు కదుపుతున్నారు.
తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో ఏకగ్రీవాలతోపాటు వేలం సందడి మొదలైంది. తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో చిన్న పంచాయతీలు, తండాల్లో వేలం జరుగుతున్నట్లు తెలుస్తోంది. చిన్న పంచాయతీలు, తండాల్లో ఎన్నికలు జరగడం ద్వారా అభ్యర్థులు లక్షల్లో డబ్బులు ఖర్చు చేయడం కంటే ఆ డబ్బులు గ్రామ అభివృద్ధికి వినియోగిస్తే మేలని గ్రామపెద్దలు నిర్ణయానికి వచ్చినచోట సర్పంచ్ పదవులకు వేలం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇటీవల సంగారెడ్డి మండలంలోని ఓ తండాలో రెండు వేర్వేరు పార్టీలు మద్దతు పలుకుతున్న నాయకులు సర్పంచ్ పదవులకు పోటీ పడ్డారు. దీంతో తండాలో సర్పంచ్ పదవి ఒక్కరికే దక్కేలా వేలం నిర్వ హించినట్లు సమాచారం. ఈ వేలంలో సర్పంచ్ పదవికి పోటీపడిన ఇద్దరు అభ్యర్థులు లక్షల్లో వేలం పాడినట్లు తెలుస్తుంది. చివరగా ఒక అభ్యర్థి రూ.25 లక్షలు పాడి సర్పంచ్ పదవిని దక్కించుకున్నట్లు సమాచారం. బరిలో నిలిచిన అభ్యర్థి నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు అంగీకరించినట్లు తెలిసింది.
