సిద్దిపేట, ఏప్రిల్ 17: యాసంగి వరికోతలు షురూ కావడంతో అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 419 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో ఐకేపీ ద్వారా 211 కేంద్రాలు, పీఏసీఎస్ ద్వారా 202 కొనుగోలు కేంద్రాలు, మెప్మా ద్వారా 6 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. యాసంగిలో జిల్లాలో 3.46 లక్షల ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. 8లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ, జిల్లాలో 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో దొడ్డు వడ్లు 4.70 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, సన్నాలు 30వేల మెట్రిక్ టన్నులు సేకరించనున్నారు.
ఏప్రిల్ 1 తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. ఇప్పటికే జిల్లాలో 239 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఇందులో ఐకేపీ కొనుగోలు కేంద్రాలు 149, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలు 81 ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 98 మెట్రిక్ టన్నుల పైలుకు ధాన్యాన్ని సేకరించారు. ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో సుమారుగా 1.25 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా, కేవలం 40 లక్షల గన్నీ బ్యాగులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు 2వేల గన్నీబ్యాగులు జిల్లాకు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు 12,482 టార్పాలిన్ కవర్లు అవసరం ఉండగా, ప్రస్తుతం 8882 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మాయిశ్చర్ మీటర్లు 798 అవసరం ఉండగా, 667 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ధాన్యాన్ని తూకం వేసేందుకు 838 కాంటాలు అవసరం కాగా, జిల్లాలో 762 మాత్రమే ఉన్నాయి. ధాన్యాన్ని శుభ్రపరిచేందుకు అవసరమైన ప్యాడీ క్లీనర్లు 634 అవసరం ఉండగా, 584 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయకుండానే అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సరిపడా గన్నీబ్యాగులు, టార్పాలిన్ కవర్లు, ప్యాడీక్లీనర్లు, మాయిశ్చర్ మిషన్లు అందుబాటులో లేవు. దీంతో ధాన్యం సేకరణకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి.
తద్వారా రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అకాల వర్షాలు, వడగండ్లు పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం తడిస్తే ఇబ్బందులు తప్పవని భయాందోళన చెందుతున్నారు. ఈసారి యాసంగి సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాగునీటి సమస్య, అప్రకటిత విద్యుత్ కోతలతో చాలాచోట్ల పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారు. తీరా ఇప్పుడు అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయకుండానే సెంటర్లు ప్రారంభించడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు.