సిద్దిపేట, మే 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయింది. నత్తనడకన కొనుగోళ్లు జరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన కర్షకులకు ఇప్పుడు కష్టాలే మిగిలాయి. కాలం నెత్తిమీదికి వచ్చింది, ధాన్యం అమ్ముడు పోలేదు, చేతికి డబ్బులు రాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం నుంచి రాత్రివరకు రైతులు కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు. లారీలు లేవు గోదాముల్లో స్థలం లేదు, తేమ శాతం ఎకువగా ఉంది అంటూ రోజుకో కారణం చెబుతూ కొనుగోళ్లు వాయిదా వేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు నిత్యం రోడ్డెక్కుతున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని అక్కన్నపేట మండలంలోని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొన్ని చోట్ల మిల్లర్లు ధాన్యం దించుకోకపోతే రైతులే హమాలీలుగా మారి ట్రాక్టర్ల నుంచి ధాన్యం అన్లోడింగ్ చేశారు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్‌కు ఐదు నుంచి ఆరు కిలోల వరకు కోత విధిస్తూ రైతుల శ్రమను దోచుకుంటున్నారు. ప్రభుత్వం సరిపడా గోనె సంచులు అందించక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది రైతులు గన్నీబ్యాగులు బయట నుంచి కొనుగోలు చేసి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఉమ్మడి మెదక్ జిల్లాలో 40.37 శాతమే
కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నలభై రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో 40.37 శాతం మాత్రమే కొనుగోలు పూర్తి చేశారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కలిపి మొత్తం 9,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు కేవలం 3,91,642 ధాన్యం సేకరించారు.సిద్దిపేట జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంకాగా ఇప్పటి వరకు 1,80,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. మెదక్ జిల్లాలో 3.50 లక్షల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1,57,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
సంగారెడ్డి జిల్లాలో 2,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 54,642 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. నలభై రోజులు గడుస్తున్నా కేవలం ఉమ్మడి జిల్లాలో 40.37 శాతం మాత్రమే కొనుగోలు పూర్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ సమయానికి 90 శాతానికి పైగా ధాన్యం సేకరణ పూర్తయితే కాంగ్రెస్ హయాంలో నత్తనడకన ధాన్యం కొనుగోలు చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే ఉంది. రైతులు వారాల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు.
నిలువు దోపిడీ చేస్తున్న మిల్లర్లు, నిర్వాహకులు
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేట జిల్లాలో ఏ గ్రేడ్ ధాన్యాన్ని బీ గ్రేడ్‌గా నమోదు చేస్తుండడంతో రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలా చేయడం వల్ల మిల్లర్లు, వారితో కుమ్మక్కైన అధికారులు లబ్ధిపొందతున్నారు. పది రోజులుగా జిల్లాలో సేకరిస్తున్న ధాన్యం మొత్తం బీ గ్రేడ్‌గానే కొనుగోలు చేయడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. ధాన్యం సేకరణలో భాగంగా వివిధ కారణాలు చూపుతూ అంతా కామన్ రకంగా చూపుతున్నారు.
జల్లెడ పట్టిన, తాలు లేకుండా చేసిన కామన్ కిందనే లెక్క గడుతున్నారు. ఇదేంటి అని రైతులు ప్రశ్నిస్తే నానా రకాలుగా కొర్రీలు పెట్టి ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇదే కాకుండా ఒక క్వింటాల్‌కు తరుగు కింద ఐదు కిలోల నుంచి ఆరు కిలోలు తీస్తున్నారు. మిల్లర్లు, క్షేత్ర స్థాయి అధికారులు కుమ్మక్కై రైతులను నిలుపుదోపిడీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. విత్తు విత్తిన నాటి నుంచి పంట అమ్ముకునేదాకా అన్నీ కష్టాలే. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు.

కొనుగోలు ఆలస్యం పెద్ద సమస్య..
ధాన్యం అమ్ముడైతేనే అప్పులు తీర్చగలమని ఆశపడ్డ రైతులకు కొనుగోలు ఆలస్యం పెద్ద సమస్యగా మారింది. బ్యాంకు రుణాలు, ప్రైవేట్ అప్పులు, పిల్లల చదువులు, కుటుంబ ఖర్చులు రైతు మెడకు ఉరిలా మారాయి. ఒకవైపు కొనుగోలు చేయకపోవడం మరోవైపు అప్పుల ఒత్తిడి రైతును మానసికంగా కుంగదీస్తోంది.
రైతుల పరిస్థితి ఘోరం
కాంగ్రెస్ సర్కారు హయాంలో రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. మా నాన్న చనిపోయినప్పటి నుంచి నేను ఎవుసం చేస్తున్నా. గిట్లాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. అధికారులు కూడా రైతుల బాధలు పట్టించుకోవడం లేదు. వడ్లు తీసుకువచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు. 30 బస్తాల వడ్లు మొత్తం చెదలుపట్టింది. కొనుగోలు కేంద్రం నిర్వహణ సరిగ్గా లేదు. ఇగ అలసిపోయి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన. రైతుల కష్టాలు చూస్తుంటే బాధనిపిస్తోంది. ధాన్యం పండించిన రైతులు నేడు ఆగమైపోతున్నారు.
– వంగాల శ్రీనివాస్‌రెడ్డి, రైతు, గొల్లకుంట (సిద్దిపేట జిల్లా)
అవస్థలు పడుతున్నాం
ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను కొనడానికి ఈ సర్కారుకు చాతనైతలేదు. కొనుగోలు కేంద్రాల్లో నెల రోజుల నుంచి అవస్థలు పడుతున్నాం. ఇప్పటికి ఇంకా వడ్లు కొనుగోలు కేంద్రంలోనే ఉన్నాయి. ఇటు సర్కారు, అటు అధికారులు రైతులను పట్టించుకోవడం లేదు. ధాన్యం కొనేందుకు అనేక విధాలుగా కొర్రీలు పెడుతున్నారు. అయినా గతి లేక ధాన్యం అమ్ముకుంటున్నాం. పైసలు కూడా రైతుల ఖాతాల్లో పడతలేవు. ఈ సర్కారును నమ్మి రైతులు ఓట్లు వేసినందుకు బుద్ధిచెప్పారు.
– కాశబోయిన శ్రీనివాస్, రైతు, గొల్లకుంట(సిద్దిపేట జిల్లా)
