సిద్దిపేట, మే 20: ఆరుగాలం పంటలు పండించిన రైతులు, ఆ పంటలను అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నాడు. బీఆర్ఎస్ పాలనలో ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించిన రైతన్నకు నేడు ధాన్యం అమ్ముకోవడం ఒక టాస్ల మారింది. ధాన్యం కంటాలుకాకా ఇబ్బంది పడుతున్న రైతులకు వర్షం ఆశనిపాతంలా తయారైంది. రోజూ ధాన్యా న్ని ఆరబెట్టిన రైతన్నకు సాయంత్రం వచ్చే వర్షం తీవ్ర కష్టాలను మిగులుస్తుంది. సిద్దిపేట రూరల్ మండలం పెద్దలింగారెడ్డిపల్లి, పుల్లూ రు, నారాయణరావుపేటలో ధాన్యం కుప్పలు కొనుగోలు కేంద్రాల్లోనే దర్శనమిస్తున్నాయి. 20 రోజులైనా ధాన్యాన్ని కొనడం లేదని రైతు లు వాపోతున్నారు. ఒకవైపు లారీలు రాకపోవడం, ఆరబెట్టిన తర్వాత కురుస్తున్న వర్షంతో ధాన్యం మొలకెత్తుతున్నదని వాపోతున్నారు. కొన్ని కొనుగోలు కేంద్రాల్లో ఒకో బస్తాకు రెండున్నర కిలోల వరకు ధాన్యాన్ని కట్ చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 45 రోజులు అవుతుంది. ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేయలేదు. తొమ్మిది ట్రిప్పుల వడ్లు తీసుకొచ్చా.. ఇటీవల పడిన వానలతో వడ్లు తడిసి మొలకెత్తుతున్నయి. పోయినసారి తొందరగా కొనుగోలు చేశారు. ఈసారే ఇబ్బంది అవుతుంది. వానకు వడ్లు నానడంతో వాటిని ఎండబెట్టడం, కుప్ప చేయడం కష్టంగా మారింది. తొందరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.
కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 16 రోజులవుతుంది. రెండు కుప్పల వడ్లు పోసిన, మంచిగా ఎండినై, కొనుగోలు చేయడం ఆలస్యంకావడంతో మూడు రోజులపాటు కురిసిన వర్షానికి వడ్లన్నీ తడిసి మొలకలు వచ్చినయి. వడ్లు తూకం వేయమని అడిగితే రోజూ రేపుమాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. లారీలు సరిపోయే విధంగా రాకపోవడంతో కొనుగోళ్లు ఆలస్యంగా జరుగుతున్నాయి.