సంగారెడ్డి,అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో ధాన్యం సేకరణ ప్రారంభమైంది. వరి కోతలు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. మరో రెండు వారాల తర్వాతే వరి కోతలు ఊపందుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరే అవకాశం ఉంది. ధాన్యం కొనుగోలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు 16 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. మొదట విడతగా మండలానికి ఒక కొనుగోలు కేంద్రం ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. వరికోతలు పూర్తిస్థాయిలో ప్రారంభమైన తర్వాత 211 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయనున్నారు.
జిల్లాలో గత యాసంగి సీజన్లో ధాన్యం సేకరణ అస్తవ్యస్తంగా సాగింది. అధికారుల్లోసమన్వయలోపం,రవాణా, లేబర్, గోదాములు తదితర సమస్యలతో ధాన్యం సేకరణ సజావుగా సాగలేదు. సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి స్వయంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి ధాన్యం కొనుగోళ్లు, తరలింపు సజావుగా సాగేలా చూడాల్సి వచ్చింది. యాసంగి(రబీ) సీజన్లో ఇబ్బందులు ఎదురైన దృష్ట్యా, గత అనుభవాల నేపథ్యంలో ప్రస్తుత వానకాలం సీజన్లో ఎలాం టి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యం త్రాంగం ధాన్యం సేకరించాలని రైతులు కోరుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లాలో వానకాలంలో 1,09,415 ఎకరాల్లో వరి సాగుచేశారు. 2.32 లక్షల క్విం టాళ్ల వరి దిగుబడి వస్తుందని అధికారుల అం చనా వేశారు. ఇందులో మార్కెట్లోకి 2.11 లక్షల టన్నుల ధాన్యం విక్రయానికి రానుందని, ఆ మేర ధాన్యం సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దొడ్డుబియ్యం, సన్నబియ్యం సేకరణకు వేర్వేరుగా సెంటర్లు ఏర్పా టు చేస్తున్నారు. మొత్తం 211 కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఐకేపీ ఆధ్వర్యం లో 101, పీఏసీఎస్ 94, డీసీఎంఎస్ 16 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 26 సన్నబియ్యం కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఇటీవలే మంత్రి దామోదర రాజనర్సింహ శివ్వంపేటలో ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని ప్రారంభించారు. వరి సాగు అధికంగా ఉన్న మరో 15 మండలాల్లో కొనుగోలు కేం ద్రాలు ప్రారంభమయ్యాయి. వచ్చేనెల మొద టి వారంలో మిగతా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. 52.77 లక్షల గన్నీ బ్యాగులు, ఏడువేల టార్పాలిన్లు, 183 వెయింగ్ మిషన్లు, 250 తేమ కొలిచే యం త్రాలు అవసరం కానున్నాయి. వీటిని పౌరసరఫరాల శాఖ సమకూరుస్తున్నది.
గత యా సంగి సీజన్లో ధాన్యం సేకరణలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రవాణా సమస్య తీవ్రంగా ఉండటంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణకు అంతరాయం కలిగింది. వాహనాల్లో ధాన్యం బస్తాల లోడింగ్‌కు కార్మికులు లేకపోవడం మరింత ఇబ్బందులకు దారితీసింది. అప్పట్లో అధికార పార్టీకి చెందిన వ్యక్తికి రవాణా కాంట్రాక్టు అప్పగించారు. ఈసారి సైతం అధికార యంత్రాంగం అతనికే రవాణా బాధ్యతలు అప్పగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా, కాం గ్రెస్ ప్రభుత్వ కేవలం సన్నవడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొడ్డు వడ్లకు కూడా బోన స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దొడ్డు వడ్లకు రూ.2340, సన్నవడ్లకు రూ.2320 మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించింది. సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా దొడ్డు వడ్లు పండిస్తారు. 97వేల ఎకరాల్లో రైతులు దొడ్డు వరి సాగు చేయగా, 2.11 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం దిగుబడి రానుందని అంచనా. దొడ్డు ధాన్యం ఎక్కువగా ఉన్నందున బోనస్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.