మెదక్ జిల్లాకు 6.90 లక్షలు అవసరం
923 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 1.26 లక్షల మంది విద్యార్థులు
ఇప్పటికే మూడు విడతల్లో గోదాములకు చేర్చిన విద్యాశాఖ
ఆరు నుంచి పది తరగతుల పుస్తకాలకు క్యూఆర్ కోడ్
తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రచురణ
మెదక్ మున్సిపాలిటీ, జూన్ 12: మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం తరఫున అందజేసే ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. పాఠశాలలు ప్రారంభం రోజు నాటికి విద్యార్థులకు పంపిణీ చేసేలా జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. కొత్త విద్యా సంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ప్రవేశాలు పొందేవారితో పాటు ప్రస్తుతం చదువుకుంటున్న వారికి పాఠ్యపుస్తకాలు అందనున్నాయి. ప్రస్తుతం జిల్లాకు అవసరమైన పుస్తకాలు విడతల వారీగా గోదాములకు చేరుకుంటున్నాయి. వాటిని త్వరలోనే మండలాలు, అక్కడి నుంచి పాఠశాలలకు పంపుతారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 923 ఉన్నాయి.
కేజీబీవీలు 15, ఆదర్శ పాఠశాలలు 7, బీసీ వెల్ఫేర్ (జ్యోతిబా ఫూలే) 7, సాంఘిక సంక్షేమ గురుకులు 4, ట్రైబల్ వెల్ఫేర్ 5, మినీ గురుకులాలు 2, మైనార్టీ గురుకులు 2, ఆశ్రమ పాఠశాలలు 2 ఉన్నాయి. ఈ బడులకు విద్యాశాఖ నేరుగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నది. వీటిలో చదివే విద్యార్థులకు యూడైస్ వివరాల ప్ర కారం 6 లక్షలా 90 వేల పుస్తకాలు అవసరమని విద్యాశాఖ నివేదిక సమర్పించింది. ఇప్పటి వరకు జిల్లాకు మూడు విడతల్లో పుస్తకాలు గోదాములకు చేరాయి. మిగతా పుస్తకాలు మరో రెండు రోజుల్లో రానున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్
ఆరు నుంచి పది తరగతులకు చెందిన పాఠ్యపుస్తకాల్లోని పాఠాలు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌తో వీక్షించి, సులభంగా అర్థం చేసుకునేలా తయారుచేశారు. ప్రతి పుస్తకంపై అందులోని అన్ని పాఠాలకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. సెల్ ఫోన్‌తో కోడ్ స్కాన్ చేస్తే విద్యార్థులకు ఆ పాఠ్యాంశాన్ని దృశ్య రూపకంగా చూడొచ్చు. ఈ పాఠ్య పుస్తకాలు పక్కదారి పట్టకుండా ప్రత్యేక నంబర్లు కూడా ముద్రించారు. వీటి ఆధారంగా ఆయా మండలాల్లోని ఏ పాఠశాలకు పాఠ్యపుస్తకాలు పంపించారనేది రికార్డుల్లో నిక్షిప్తంకానున్నది.
ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో..
నూతన విద్యా సంవత్సరంలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నది. జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఇది వరకే శిక్షణనిచ్చారు. ఒక పేజీలో ఆంగ్లంలో, పక్కనే గల మరో పేజీలో తెలుగులో పాఠ్యాంశాలు ఉండేలా పుస్తకాలను ముద్రించారు. దీంతో ఒకేసారి ఆంగ్ల మాధ్యమంలో అర్థం చేసుకోవడానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉండడంతో రెండు మాధ్యమాల్లో ఉంటే విద్యార్థులకు మరింత సులువుగా అర్థం కావడంతో పాటు ఆంగ్లంపై పట్టు సాధించడానికి అవకాశం కలుగుతుంది. 2023-24 విద్యా సంవత్సరం లో 9వ తరగతి, 2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ఆంగ్ల మాధ్యమంలో బోధనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
యూ-డైస్ వివరాల ప్రకారం..
ప్రభుత్వం యూ-డైస్ (యూనిక్ డిస్ట్రిక్ ్టఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్) వివరాల ప్రకారం పాఠ్యపుస్తకాలు పంపిణీచేస్తున్నది. మెదక్ జిల్లాలో 923 ప్రభుత్వ పాఠశాలలు, కేజీవీబీ, ఆదర్శ, మైనార్టీ, తదితర గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు లక్షా 26 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ ఉచితంగా పాఠ్యపుస్తకాలు ప్రభుత్వం అందజేస్తున్నది. ఇప్పటి వరకు మూడు విడుతల్లో పాఠ్యపుస్తకాలొచ్చాయి. మిగతా పుస్తకాలు త్వరలో రానున్నాయి.
– రమేశ్‌కుమార్, జిల్లా విద్యాధికారి, మెదక్