వ్యవసాయ యూనివర్సిటీ, సెప్టెంబర్ 19: మనదేశంలో గ్రామీణ ప్రాంతంలో పశుపోషణపై ఎంతోమంది ఆధారపడి బతుకున్నారని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయంతో పాటు పశుపోషణ వెన్నెముక అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ అగ్రి వర్సిటీ ఆడిటోరియంలో వీసీ జ్ఞానప్రకాశ్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పశుపోషణలో మన పాత్ర మరింత పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
మాంసం, చేపలు, గుడ్లు మన రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. పశువైద్య విభాగం అభివృద్ధికి, పశుసంపద సంక్షేమానికి వెటర్నరీ విద్యార్థులు,వైద్యులు తోడ్పడాలని సూచించారు. చేపల పెంపకం, పశుపోషణ మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచి జీడీపీ మరింత పెరగడానికి దోహదపడుతుందని గుజరాత్ జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు (ఎన్డీడీబీ) ఎండీ డాక్టర్ మినేష్షా అన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. పీజీ, పీహెచ్డీ, యూజీ పూర్తిచేసిన దాదాపు 524 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు.
విశ్వవిద్యాలయం మెరిటోరియస్ ఇద్దరు ఉత్తమ అధ్యాపకులకు,16 మంది పీహెచ్డీ, 69 మంది మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, 439 మంది విద్యార్థులకు బ్యాచ్లర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండ్రీ, బీటెక్ డెయిరీ, బ్యాచ్లర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ పట్టభద్రులు ఉన్నారు. ప్రతిభ కనబర్చిన 18 మంది విద్యార్థులకు 25 బంగారు పతకాలు, ప్రతిభా పురస్కారం అందజేశారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ శరత్ చంద్ర, సత్యనారాయణ, శ్రీనివాస్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.