సంగారెడ్డి, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ఊహాగానాలు వెలువడుతున్న ఈ క్రమంలో అధికార యంత్రాంగం స్థానిక రిజర్వేషన్లను మంగళవారం ఖరారు చేసింది. సంగారెడ్డి జిల్లా యంత్రాంగం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్లు పూర్తిచేసింది. జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టరేట్ జిల్లా యంత్రాంగానికి పంపింది. డైరెక్టరేట్ నుంచి వచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా మండలం యూనిట్‌గా స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలిసింది.
గోప్యంగా…
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 25 జడ్పీటీసీ, 25 ఎంపీపీ, 261 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 613 పంచాయతీలు, 5370 పంచాయతీ వార్డులు ఉన్నాయి. ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు రిజర్వేషన్లు పూర్తి చేశారు. రిజర్వేషన్ వివరాలను అధికార యంత్రాంగం గోప్యంగా ఉంచింది. రిజర్వేషన్ వివరాలు బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
పంచాయతీ వార్డు రిజర్వేషన్లు ఎంపీడీవోలు, సర్పంచ్ రిజర్వేషన్లు ఆర్డీవోలు పూర్తి చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ సీఈవో, డీపీవో, డీఆర్డీవో, ఆర్డీవోలు జడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిచేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్లు అధికారులు ఖరారు చేశారు. 2024 చేపట్టిన కులగణన ఆధారంగా బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన అనంతరం స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను లాటరీ పద్ధ్దతిలో అధికారులు అమలు చేస్తారు.
అందరి దృష్టి బీసీ రిజర్వేషన్లపైనే
అధికార యంత్రాంగం స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టడంతో అందరి దృష్టి బీసీ రిజర్వేషన్లపైనే పడింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే జీవో వెలువడవచ్చని తెలుస్తున్నది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలో బీసీ రిజర్వేషన్ జీవో వెలువడనున్న నేపథ్యంలో అక్టోబర్‌లో స్థానిక సంస్థలు జరగవచ్చనే ప్రచారం జోరుగా సాగుతున్నది.
ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నాయకులు, ఆశావహుల దృష్టంతా రిజర్వేషన్లపై ఉంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవులకు సంబంధించి మెజార్టీ స్థానాలు బీసీలకు రిజర్వే అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో జిల్లాలో ఏయే స్థానాలు బీసీలు, జనరల్,ఎస్సీ,ఎస్టీలకు రిజర్వు అవుతాయనేది తెలుసుకునేందుకు నాయకులు, ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు తెలిసిన అధికారుల ద్వారా రిజర్వేషన్లపై ఆరా తీస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో 613 పంచాయతీలు ఉండగా, ఇందులో 200 నుంచి 250 సీట్లు బీసీలకు రిజర్వు అయ్యే అవకాశాలు ఉన్నాయి. 5370 వార్డులకు మెజార్టీ వార్డులు బీసీలకు రిజర్వు అయ్యే అవకాశం ఉంది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 25 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, ఇందులో సగం స్థానాలు బీసీలకు రిజర్వు కావచ్చు. 261 ఎంపీటీసీ స్థానాల్లో వందకుపైగా స్థానాలు బీసీలకు రిజర్వు అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు కావడంతో బరిలోకి దిగేందుకు ఆశావహులు సన్నద్ధ్దం అవుతున్నారు. రాజకీయపార్టీలు సైతం రిజర్వేషన్ల ప్రక్రియతో పాటు స్థానిక పోరుపైనా దృష్టి సారించాయి.