సంగారెడ్డి, జనవరి 5(నమస్తే తెలంగాణ) : ఇందిరమ్మ ఇండ్ల సర్వే జరుగుతున్న తీరుపై అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు దరఖాస్తుదారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు ఇందిరమ్మ ఇండ్ల సర్వే పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. కానీ, సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 70శాతం సర్వే మాత్రమే పూర్తయ్యింది. మరో 30శాతం వరకు సర్వే జరగాల్సి ఉంది. ఇది పూర్తిచేయడానికి మరో పది రోజులకుపైగా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో సర్వే నత్తనడకన జరగడంపై ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
సర్వే నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది గ్రామా ల్లో ముందస్తు సమాచారం ఇవ్వక పోవడంతో దరఖాస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం యాసంగి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎక్కువశాతం మంది వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ సమయంలో సర్వే సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తున్నారు. దీంతో ఎక్కువ మంది సర్వేకు హాజరుకాలేకపోతున్నారు.సర్వే నిర్వహిస్తున్న సమయంలో దరఖాస్తుదారు లేకపోతే సర్వే సిబ్బం ది వారికోసం వేచి చూడకుండా వెళ్లిపోతున్నారు. దీంతో దరఖాస్తుదారులు తమ వివరాలను నమోదు చేయించుకోలేక పోతున్నా రు.
నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల నుంచి ఉపాధి కోసం చాలామంది హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. వలస వెళ్లిన వారి దరఖాస్తులను సర్వే సిబ్బంది పరిశీలించడం లేదు. అధికార పార్టీ నేతలు సూచించిన దరఖాస్తుదారులకు సంబంధించి వివరాల సేకరణకు సర్వే సిబ్బంది ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందిరమ్మ కమిటీల్లో సైతం అధికార పార్టీ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు నిష్పక్షపాతంగా జరుగుతుందా లేదా అన్న సందేహాలు దరఖాస్తుదారుల్లో వ్యక్తమవుతున్నా యి. ఇందిరమ్మ ఇండ్ల సర్వే యాప్‌లో పదే పదే సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సర్వే చేయడంలో శ్రద్ధ్ద చూపడంలేదన్న విమర్శలు ఉన్నా యి. దీంతో గడువులోగా సర్వే పూర్తికావడం గగనంగా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇంటి స్థలం ఉన్న పేదలకు రూ.5 లక్షలు అందజేస్తామని ప్రకటించింది. ఈ పథకం కోసం ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించింది. సంగారెడ్డి జిల్లాలో 3,18,775 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందోలు నియోజకవర్గంలో 344,369, నారాయణఖేడ్‌లో 66,451, పటాన్చెరులో 49,838, సంగారెడ్డిలో 58,553, జహీరాబాద్‌లో 75,835 మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. హత్నూర మండలంలో 12,729 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం డిసెంబర్ 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు సర్వేకు ఆదేశించింది. ఆ మేరకు జిల్లాలో సర్వే చేపడుతున్నారు. ఇప్పటి వరకు 70 శాతం సర్వే పూర్తిచేశారు. మొత్తం 3,18,775 దరఖాస్తులకు అధికారులు 2,20,751 దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్లి సర్వే పూర్తి చేశారు. అందోల్ నియోజకవర్గంలో 37,456, నారాయణఖేడ్‌లో 42,542, పటాన్చెరులో 38,167, సంగారెడ్డిలో 43,031, నారాయణఖేడ్‌లో 75,835, హత్నూర మండలంలో 9552 దరఖాస్తుల సర్వే పూర్తయ్యింది. పూర్తి చేసిన సర్వేలో 2,11,336 దరఖాస్తులను ఆన్లైన్లో సబ్మిట్ చేశారు.