మిరుదొడ్డి (అక్బర్పేట-భూంపల్లి)/కొండపాక, జూలై 7 : సిద్దిపేట జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరాయి. పైకప్పులు పెచులూడుతుండడంతో విద్యార్థులు, టీచర్లు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అక్బర్పేట-భూంపల్లి మండలం జంగపల్లి ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు 41 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
ఇటీవల పాత పాఠశాల భవనం వరండాలోని రూప్ కింది భాగం వర్షాలకు ఉరిసి తేమతో పెచ్చులు ఊడి పడ్డాయి. కొంతకాలంగా పాఠశాల రూప్ కింది భాగం పెచ్చులు ఊడి పడినా అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ప్రమాదం జరుగకముందే తగు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపేట శివారు సార్లవాడలోని ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరింది. పైకప్పు ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉండడంతో విద్యార్థులు భయం భయంతో పాఠశాలకు వెళ్తున్నారు. పాఠశాల భవనం గురించి అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేకుండాపోలేదని గ్రామ సర్పంచ్ కొయ్యడ వెంకటేశం తెలిపారు.పాఠశాల భవనం గురించి ప్రజావాణిలో విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు.
పాఠశాలలో రెండు గదులు ఉండగా, ఒక గది పూర్తిగా పెచ్చులు ఊడి, మరోగది వర్షం రావడంతో ఊరుస్తున్నదని, ప్లాస్టిక్ కవర్ కట్టుకొని కాలం వెళ్లదీస్తున్నట్లు ఉపాధ్యాయలు తెలిపారు. పాఠశాలలో 21 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొత్త భవనాన్ని నిర్మించాలని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.